జ్యోతిష్యం, శకున శాస్త్రంలో కాకులకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇంటి చుట్టుపక్కల తరచూ కనిపించే ఈ పక్షులు కేవలం సాధారణ జీవులు కాదు, కొన్ని సంకేతాలు, సందేశాలను అందిస్తాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా కాకులు శనితో సంబంధం కలిగినవిగా పండితులు చెబుతుంటారు. అందుకే వీటి చర్యలు మానవ జీవితంపై మంచి లేదా చెడు ప్రభావం చూపుతాయని చాలా మంది విశ్వసిస్తారు.
కాకులను యమదూతలుగా కూడా భావిస్తారు. రాబోయే పరిణామాలను ముందే గుర్తించే శక్తి వీటికి ఉందని చెబుతారు. అందుకే కాకి చేసే శబ్దం, ఎటు చూసి కూర్చుంటుందో, ఎక్కడ నీరు తాగుతుందో వంటి అంశాలను శకునంగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు ఒక కాకి బాల్కనీలో కూర్చుని గట్టిగా అరుస్తుంటే త్వరలో అతిథులు వస్తారని అనుకుంటారు. ముఖ్యంగా ఇంటికి ఆతిథ్యాన్ని సూచించే సంకేతంగా ఇది పరిగణించబడుతుంది. మధ్యాహ్న సమయంలో ఉత్తర దిశలో కాకి అరుస్తే అదృష్టం వస్తుందని భావిస్తారు.
తూర్పు వైపున కాకులు శబ్దం చేస్తే అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇకపోతే మీరు ప్రయాణానికి బయలుదేరే సమయంలో కాకి మీ ఇంటి కిటికీ దగ్గర శబ్దం చేస్తే, ఆ ప్రయాణం విజయవంతంగా ఉంటుందని నమ్మకం ఉంది. ఈ విధంగా కాకుల కేకలు కొన్ని సందర్భాల్లో శుభసూచికలుగా తీసుకుంటారు.
కానీ ప్రతిసారి కాకి అరవడం మంచిదే అనుకోవడం సరికాదు. ఇంటి బాల్కనీ లేదా టెర్రస్ పై కాకుల గుంపు గట్టిగా అరుస్తుంటే అది చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. కుటుంబంలో విభేదాలు రావచ్చని లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని శకున శాస్త్రం చెబుతుంది.
అదేవిధంగా దక్షిణ దిశలో కాకి కూర్చుని గట్టిగా అరిస్తే చేస్తే పితృదోషానికి సూచనగా భావిస్తారు. అంటే మన పూర్వీకులు సంతృప్తిగా లేరని దీని అర్థం. ఇక మంచి శకునాల గురించి మాట్లాడితే, కాకి నీరు తాగుతున్న దృశ్యం చూడటం చాలా శుభప్రదమని చెబుతారు. ఆ సమయంలో మీరు ఏదైనా పని కోసం బయలుదేరితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. అదేవిధంగా ఒక కాకి రొట్టె ముక్కతో ఎగిరిపోతుంటే మీ కోరిక నెరవేరబోతుందన్న సంకేతం అని నమ్ముతారు. కాకులు సాధారణ పక్షులే అయినప్పటికీ వాటి ప్రవర్తనను గమనించి అర్థం చేసుకోవడం ద్వారా మనిషి మనసులో ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది.
