దళిత బంధు పథకం అక్రమాల పుట్ట.. అంటూ విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి తెలంగాణలో. గులాబీ పార్టీ మాత్రం ‘ఆల్ ఈజ్ వెల్’ అంటోంది. ఈ పథకం పేరు చెప్పి ప్రజా ప్రతినిథులు.. అందునా, అధికార పార్టీ అడ్డగోలుగా దోచేస్తోందని విపక్షాలు ఆరోపిస్తోంటే, అదంతా అర్థం పర్థం లేని విమర్శగా కొట్టి పారేశాు గులాబీ నేతలు.
కానీ, స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ తమ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు పథకానికి సంబంధించి లబ్దిదారుల నుంచి 3 లక్షల వరకు నొక్కేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇంకోసారి వసూళ్ళకు దిగితే టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, పార్టీ నుంచి వెళ్ళగొడతాం..’ అంటూ కేసీయార్ హెచ్చరించేశారు.
అదేంటీ, లబ్ది దారుల నుంచి మూడేసి లక్షల వరకు కొట్టేసిన ఎమ్మెల్యేల లిస్టు తన దగ్గర వున్నప్పుడు, ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలి కదా.? సదరు ఎమ్మెల్యేలను జైల్లో పెట్టించాలి కదా.? పార్టీ నుంచి అయినా సస్పెండ్ చేయాలి కదా.?
‘ప్రజా ప్రతినిథులే కాదు, వారి అనుచరులు అక్రమాలకు పాల్పడినా ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలి..’ అంటూ కేసీయార్ హెచ్చరించేశారు. ఇదెక్కడి వింత.? అంటూ తెలంగాణ సమాజం మొత్తం కేసీయార్ వ్యాఖ్యలపై విస్తుపోతోంది.
ఎక్కడన్నా అవినీతి పరులకు ఇంకో ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందా.? దోచేసిన సొమ్ముని తిరిగి రాబట్టాలి కదా.? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లుపడుతున్నాయి.