Congress Party: కాంగ్రెస్ ఇచ్చిన జాబితా పక్కన పెట్టి.. కాంగ్రెస్ కు కేంద్రం సర్‌ప్రైజ్!

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికలపై వివరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు పంపించి, తమ తరఫున సభ్యులను సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీల పేర్లను సూచించినా.. కేంద్రం ఎంచుకున్న తీరు మాత్రం సర్‌ప్రైజ్‌గా మారింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ మే 16న మధ్యాహ్నం వరకు ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డా. నసీర్ హుస్సేన్, రాజా బ్రార్‌లను ప్రతినిధులుగా సూచించినట్లు పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ జాబితాలో శశి థరూర్ పేరు లేదు. అయినప్పటికీ, కేంద్రం మాత్రం థరూర్‌కే అఖిలపక్ష బృంద నాయకత్వాన్ని అప్పగించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

నాలుగుసార్లు తిరువనంతపురం ఎంపీగా గెలిచిన థరూర్ అంతర్జాతీయ సంబంధాలపై తన పదునైన అభిప్రాయాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు దీనిపై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా, తమ సూచనల్ని పక్కనపెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఇలా చేశారా? లేక శశి థరూర్ అంతర్జాతీయ మైండ్‌ను పరిగణలోకి తీసుకుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.