అటు రాహుల్ అరెస్టు… ఇటు మోడీకి థాంక్స్ చెప్పిన టి. కాంగ్రెస్ ఎంపీ!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్‌ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోడీని విమర్శించినందుకు దాఖలైన పరువు నష్టం పిటిషన్‌ పై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో బీజేపీపైనా, మరి ముఖ్యంగా మోడీపైనా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కావాలనే రాహుల్ పై పరువునష్టం దావా వేసి జైలు శిక్ష పడేలా చేశారని అంటున్నారు. మోడీ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని శాపనార్థాలు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలే కాదు.. తమ పార్టీ నేతకు ఇలా జరిగితే ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు. కానీ… అంతర్గత ప్రజాస్వామ్యం మితిమీరి ఉండే కాంగ్రెస్ లో మాత్రం ఇందుకు విభన్నమైన సీన్స్ జరుగుతున్నాయి.

అవును… ఒకపక్క రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడితే… సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. గతంలో కూడా బీజేపీ మంత్రులతో కోమటి భేటీ అయ్యేవారు.. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడిగేవారు. అయితే సరిగ్గా రాహుల్ అరెస్టు అంశంలో బీజేపీపై కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్న వేళ.. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మోడీని కలవడం, చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేయడం.. అనంతరం థాంక్స్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది!

అక్కడికే అనుమానాలు, వస్తున్న విమర్శలు చాలవన్నట్లు… మోడీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి… తన నియోజకవర్గంలో జాతీయ రహదారుల నిర్మాణంపై మోడీతో చర్చించానని.. ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైల్‌ పొడిగింపు ప్రతిపాదనలు అందించానని చెప్పారు. ఇదే క్రమంలో… తాను చెప్పిన అన్ని అంశాల పట్ల ప్రధాని మోడీ చాలా సానుకూలంగా స్పందించారని.. రెండు, మూడు నెలలలో అన్ని మంజూరు చేసే అవకాశం ఉందని వివరించారు. తెలంగాణలో వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారని, కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరినట్లు తెలిపారు. అక్కడితో ఆగని ఆయన.. ఈ భేటీపై మరింత ప్రశ్నించిన విలేఖరులతో…. “కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి కూడా ఉంటాయి” అని చెబుతూ.. ఫైనల్ గా ప్రధానికి థ్యాంక్స్ అంటూ ముగించారు.

కాగా… తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్స్ గా ముద్రపడిన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. ఈ సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీసు అందడం.. అనంతరం సమాధానం చెప్పుకుని సర్దుకుపోవడం తెలిసిందే. ఏది ఏమైనా… తెలంగాణ కాంగ్రెస్ కి పంటికింద రాయిలా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సరిగ్గా ఈ సమయంలో మోడీతో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది!