టీడీపీ-వైటిపీ… త్యాగల వెనుక ఉన్నది కోపమా, ప్రేమా?

ఎవరూ ఊహించని స్థాయిలో అన్నట్లుగా తెలంగాణ ఎన్నికలను భహిష్కరించాయి మోస్ట్ ఎక్స్ పీరియన్స్డ్ పార్టీ తెలుగు దేశం, ఫ్రెష్ పార్టీ వైఎస్సార్టీపీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఇవి కీలక పరిణామాలు. అయితే పైకి ధైర్యంగా చెప్పగలిగినా, ముసుగులో గుద్దులాట ఆడిగా… ఈ రెండు పార్టీలూ ఎన్నికలను బహిష్కరించడం వెనుక ఉన్నది ఒకేట్ లక్ష్యం అని అంటున్నారు పరిశీలకులు. అయితే దానికి కారణం బీఆరెస్స్ పై కోపమా.. కాంగ్రెస్ పై ప్రేమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ ప్రకటించేసింది. ఇది నాయకులను వెన్నుపోటు పొడవడమని, కార్యకర్తలను తాకట్టుపెట్టడం అని, అధినేత అనైతిక చర్య అని అలిగిన ఆగ్రహం వ్యక్తం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి కారెక్కేశారు! ఆయనకు కండువా కప్పిన కేసీఆర్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ పార్టీని వీడిన అనంతరం బీఆరెస్స్ లో ముదిరాజ్ సామాజికవర్గం పరంగా ఉన్న బలమైన నాయకత్వలోపం కాస్త తీరినట్లయ్యిందనే కామెంట్లు వినిపించాయి.

ఈ సమయంలో అటు జనసేన.. బీజేపీకి – మరోపక్క వైఎస్సారిటీపీ. కాంగ్రెస్ కి తమకు చేతనైన స్థాయిలో మద్దతిస్తుండటంపై హరీష్ రావు మైకందుకున్నారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం తీసేసినా.. ఎన్నికల వేళ ఆ సెంటిమెంట్ ను ఇంకా వాడాలని ఫిక్సయ్యారు. ఇందులో భాగంగా తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని చెప్పుకొస్తున్నారు. అంటే… బీఆరెస్స్ నేతలు మాత్రమే (వారు ఏ పార్టీనుంచి వచ్చినా… ఎప్పుడు వచ్చినా) తెలంగాణ శ్రేయోభిలాషులు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

దీంతో… ఆ ప్రేమతోనేనా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది? అని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఆ సంగతి అలా ఉంటే… ఇలా తెలంగాణలో కాంగ్రెస్, కమ్యునిస్టులు, వైఎస్సార్టీపీ… పరోక్షంగా టీడీపీలు బీఆరెస్స్ ఓటమిని ఒకేతాటిపైకి వచ్చి కోరుకోవడంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇందులో ముఖ్యంగా తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేసి, అన్యాయంగా పలుమార్లు అరెస్ట్ చేశారనే కోపం షర్మిలది అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఏపీలో తన అన్న జగన్ కు పరోక్షంగా పూర్తిస్థాయిలో సపోర్ట్ గా నిలుస్తుండటం కూడా మరోకారణం అయ్యి అంటున్నారు!!

ఇదే సమయంలో… ముఖ్యంగా ఓటుకు నోటు కేసుపేరుచెప్పి తాను రాత్రికి రాత్రి కరకట్టకు వెళ్లిపోవాల్సి పరిస్థితి కల్పించారని, ఫలితంగా రాజధాని విషయంలో తొందరపడి జీవితానికి సరిపడా డ్యామేజ్ చేసుకునేలా చేశారని, ఇప్పుడు తాను అనుభవిస్తున్న కష్టాలకు పరోక్షంగా కేసీఆర్ కూడా కారణం అని బాబు భావిస్తున్నారని అంటున్నారు! హైదరబాద్ అంటే బాబు అనే స్థాయిలో సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటే.. నేడు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్న చుట్టాన్ని చేసేశారని హర్ట్ అవుతున్నారని అంటున్నారు!

మరోపక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు జాతీయస్థాయిలో ఒకబలమైన సపోర్ట్ అవసరం. ప్రస్తుతానికి ఎన్డీయే తనను పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి… ఇండియా కూటమినైనా మచ్చిక చేసుకుంటే ప్రయోజనం ఉంటుందనేది మరో కారణం అని అంటున్నారు. ఏది ఏమైనా… తెలంగాణలో ఎన్నికల నుంచి తప్పుకోవాలనే వైఎస్సార్టీపీ, టీడీపీల నిర్ణయాల వెనుక కాంగ్రెస్ పై కాస్త ప్రేమ, బీఆరెస్స్ పై భారీ కోపం తో పాటు పరిపూర్ణమైన రాజకీయ అవసరాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు!