‘2024 ఎన్నికల్లో అధికారం మాదే.. అదృష్టం కలిసొస్తే, అంతకన్నా ముందే మేం అధికారంలోకి వస్తాం..’ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ‘మేం అధికారంలోకి రాబోతున్నాం.. రాసి పెట్టుకోండి. చంద్రబాబుతో గొడవ పడి అయినా, హోంమంత్రి పదవి సంపాదిస్తాను.. నిబంధనలకు విరుద్ధంగా, చట్టాలకు అతీతంగా పనిచేస్తున్న పోలీసు అధికారులందరిపైనా చర్యలు తీసుకుంటాను.. ఎవర్నీ వదిలి పెట్టే సమస్యే లేదు..’ అంటూ ఇటీవల టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వీరావేశంతో డైలాగులు పేల్చిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీలో హోంమంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న నేతలు చాలామందే వున్నారు. ఈ లిస్టులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు కూడా ముందు వరుసలోనే వుందట.
అనంతపురం జిల్లా నుంచి జేసీ కుటుంబం కూడా హోంమంత్రి పదవే కోరుకుంటుంది. ఇవన్నీ కాదు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హోంమంత్రి పదవి మీదే కన్నేశారంటున్నారు. దాదాపుగా ఓ పాతిక నుంచి యాభై మంది టీడీపీ నేతలు ఈ పోస్టు తమకే కావాలంటున్నారట. సరిపోయింది సంబరం.! ఆలూ లేదు, చూలూ లేదు.. అప్పుడే కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. అలాగే వుంది టీడీపీ నేతలు, తాము అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే పదవుల గురించి చెప్పుకుంటోంటే. 2024 ఎన్నికల్లో ఎంతమంది టీడీపీ నేతల రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోతుందోనన్న చర్చ ఓ పక్క రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంటే, ఇంకోపక్క పెద్ద పదవుల మీద అత్యుత్సాహం చూపిస్తున్నారు సదరు టీడీపీ నేతలు. సొంత గ్రామంలో, పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తన స్థాయిని దిగజార్చేసుకున్నారు అచ్చెన్నాయుడు. చాలామంది నేతలు, తమ తమ నియోజకవర్గాల్లో తమ ఇమేజ్‌ని తామే నాశనం చేసేసుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమే. అధికార పార్టీ వేధింపులు ఇంకో కోణం. కానీ, తమంతట తాముగా నాశనం చేసుకున్న తమ ఇమేజ్ గురించి టీడీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోకపోతే, పగటి కలలు మాత్రమే భవిష్యత్తులోనూ మిగులుతాయి.