ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు చాలా ఉపయోగపడతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో జరిగిన సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏ ప్రభుత్వం దిగిపోయినా, ఆ ప్రభుత్వం పతనం కావడానికి కమ్యూనిస్టు సోదరులే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను. గత ప్రభుత్వ పతనంలో వారి పాత్ర ఎంతో ఉంది” అని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి పెద్దగా సహకరించకపోయినా, అధికారం నుంచి దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన అధికార మార్పిడిలో, అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
సురవరం సుధాకర్ రెడ్డిని కొనియాడుతూ, ఆయన తన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి వరకు అవిశ్రాంతంగా పోరాడిన యోధుడని పేర్కొన్నారు. సమాజంలోని దురాచారాలను తొలగించడానికి ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు. మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి, బూర్గుల రామకృష్ణరావు పాలమూరు జిల్లాకు గొప్ప పేరు తెచ్చారని, రెండో తరంలో జైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వంటి నాయకులు రాజకీయాల్లో రాణించారని ఆయన అన్నారు.
అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్న నేతలను రేవంత్ రెడ్డి విమర్శించారు. కమ్యూనిస్టులు మాత్రం ప్రజల పక్షాన నిలబడి, ఎన్ని సంవత్సరాలైనా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారని, ప్రజా పోరాటాలు చేయడం గొప్ప బాధ్యత అని ఆయన అన్నారు.


