69వ నేషనల్ ఫిలిం అవార్డుల ప్రకటనపై వివాదం రాజుకుంది. సాధారణంగా గతంలో ఎక్కడా ఈ స్థాయిలో వివాదాలు రాలేదు. నేషనల్ ఫిల్మ్ అవార్డులు అంటే అవి పూర్తి జెన్యూన్ గా ఉంటాయని.. వాటిలో రాజకీయాలకు స్థానం ఉండదని.. ఉన్నప్పటికీ వీలైనంతవరకూ జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతుంటారు. అయితే ఎన్నికల సీజన్ కావడంతోనో ఏమో కానీ… ఆ సున్నితమైన గీతను తాజాగా దాటేశారనే మాటలు వినిపిస్తున్నాయి!
అవును… సోషల్ మీడియా వేదికగానే కాకుండా, నేరుగా చాలా మంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు సైతం తాజా అవార్డులపై పెదవి విరుస్తున్నారు. ఇందులో భాగంగా… ప్రధానంగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు ఇవ్వడంపై మాటల యుద్ధం నడుస్తోంది.
అసలు కశ్మీర్ ఫైల్స్ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డ్ ఇవ్వడంలో అర్ధం ఏమిటో జ్యూరీ సభ్యులకు తెలుసో లేదో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఓపెన్ అయిపోయారు. చీప్ పాలిటిక్స్ కోసం జాతీయ అవార్డుల గౌరవాన్ని తగ్గించొద్దంటూ ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం కశ్మీర్ ఫైల్స్ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు రావడంపై ట్విట్టర్ లో స్పందించారు. “నేషనల్ ఇంట్రిగ్రిషన్” అని టైప్ చేసి ఓ లాఫింగ్ ఎమోజీ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెప్పాలనుకున్న విషయం కన్ వే అయ్యిందని అంటున్నారు.
ఇదే సమయంలో కోలీవుడ్ జనాలు కూడా ఈ అవార్డుల ఎంపికపై కుతకుతలాడిపోతున్నారు. దానికి కారణం.. వాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాకు అవార్డ్ రాకపోవడమే. అదే జై భీమ్! సూర్య హీరోగా నటించిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది.
ఈ కోర్టు డ్రామాకు కచ్చితంగా అవార్డ్ వస్తుందని తమిళ ప్రేక్షకులు, కోలీవుడ్ మీడియా భావించింది. ఇదే సమయంలో అలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వాలని, వస్తుందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే ఊహించని రీతిగా ఈ సినిమాకు ఏ కేటగిరీలో అవార్డ్ దక్కకపోవడం నిజంగా బాధాకరమే!
ఇదే సమయంలో ప్రభుత్వ సొమ్ము దొంగతనం చేసి అక్రమంగా తరలించే సినిమాకు అవార్డు రావడం… పేద ప్రజలకొసం పోరాడటం, భారత దేశ న్యాయ వ్యవస్థ బలాన్ని చూపిస్తూ తీసిన సినిమాకు మాత్రం ఒక్క అవార్డూ రాకపోవడంతో… ఇది కూడా నండి అవార్డుల్లా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021లో విడుదలైన సినిమాలకు సంబంధించినవి. అయితే ఇందులో 2022 మార్చిలో విడుదలైన ఆర్.ఆర్.ఆర్., 2022 జూలైలో విడుదలైన రాకెట్రి, 2022 ఫిబ్రవరిలో విడుదలైన గంగూబాయ్ సినిమాలను కూడా అవార్డులు వరించాయి.
దీంతో… ఎంత ఎన్నికల సీజన్ అయితే మాత్రం మరీ రేపటి సినిమాకు నిన్నటి కోటాలో అవార్డు ఇవ్వడం ఏంటని ఆడుకుంటున్నారు నెటిజన్లు! దీంతో జాతీయస్థాయిలో పోసాని లాంటి వారు ఉంటే ప్రశ్నించేవారేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!