సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను సీఐడీ అధికారులు గుంటూరు సబ్‌జైలుకు తరలించారు. అయితే, ఈ తీర్పు రావడానికి ముందు కోర్టులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెయిల్ ఇవ్వాలని కోర్టును వేడుకున్న పోసాని, న్యాయమూర్తి ముందు బోరున విలపించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, జైలు జీవితం తట్టుకోలేనని, ఆత్మహత్యే దిక్కు అని భావోద్వేగంతో నిండు కన్నీళ్లతో విన్నవించారు.
కానీ, సీఐడీ అధికారులు ఈ కేసు చాలా తీవ్రమైందని, బెయిల్ ఇవ్వడం సరైనదికాదని వాదించడంతో కోర్టు రిమాండ్ విధించేందుకు అంగీకరించింది. కర్నూలు జైలు నుంచి బయటకు రావడానికి పోసాని సిద్ధమయ్యారని అనుకున్న తరుణంలో మరో కేసు కొత్త చిక్కులను తెచ్చింది. చంద్రబాబు నాయుడుపై చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరు సీఐడీ అధికారులు ఆయనపై ఐదు నెలల క్రితం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్ తీసుకుని బుధవారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
వర్చువల్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం, నేరుగా గుంటూరు తరలించారు. పోసాని బెయిల్ కోసం వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు దీనిని తిరస్కరించడంతో బెయిల్ అవకాశాలు నశించాయి. గుంటూరు కోర్టులో కూడా పోసాని తరఫు న్యాయవాదులు కఠినంగా వాదించారు. బీఎన్ఎస్ సెక్షన్ 111 పోసాని కేసుకు వర్తించదని కోర్టు దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
కానీ, పోలీసుల తరఫున న్యాయవాది పోసాని వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని, బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వాదనలు వినిపించారు. చివరకు, కోర్టు సీఐడీ వాదనను సమర్థిస్తూ పోసానిని మార్చి 26 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నో కేసులతో చిక్కుల్లో ఉన్న పోసానికి మరోసారి రిమాండ్ పడటంతో ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్టైంది. రాజకీయ ఆరోపణలు, అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ కేసు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.