కమ్యూనిస్టుల మధ్య కోల్డ్ వార్ – వైఎస్ జగన్ కారణమా?

రాష్ట్రంలో గల రెండు ప్రధాన మైన వామపక్షాలు కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీలు రాజకీయంగా చెరో దారి ఎన్నుకున్నట్లుంది. సంభవించుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవును అనే సమాధానమే రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వైకాపా ప్రభుత్వ విధానాలను విమర్శించుతోంది. కాని మార్క్సిస్టు పార్టీ ఇటీవలగా పల్లెత్తు మాట అనడం లేదు.

ఆ మాట కొస్తే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వరకు సిపిఎం కూడా మాట్లాడిన సందర్భాలు లేక పోలేదు. మూడు రాజధానుల ప్రతి పాదన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రగడ స్థానిక ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యం తదితర అంశాలపై అన్ని పార్టీల గొంతుఒకే రకంగా వినిపించింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏకాకి అయ్యారనే భావన వుండేది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో బిజెపి ఏలాంటి పొత్తు లేకున్నా రెండు పార్టీల గళం ఒకే రకంగా వుంది. అందుకే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయినట్టు రకరకాల ప్రకటనలు వెలువడ్డాయి.

అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ కూడా వైకాపా ప్రభుత్వంపై దూకుడు పెంచింది. పైగా విశాఖ పట్నంలో చంద్రబాబు నాయుడును వైకాపా శ్రేణులు అడ్డగింత చూపెట్టి పోలీసులు నిలువరించినపుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె. రామ కృష్ణ హుటాహుటిన వెళ్లి సంఘీభావం చూపెట్టారు. తదుపరి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచక సంభవించుతున్నా ఇటీవలగా మార్క్సిస్టు పార్టీ మౌనం భూషణంగా వుంది. విశేషం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై అవును కాదు అని కూడా ప్రకటనలు చేయడం మానేసింది. . తుదకు అమరావతి రాజధాని అంశంలో తొలి రోజుల్లో కొంత హడావుడి చేసినా ప్రస్తుతం ఆ పార్టీ నేతలు నోరు విప్పడం లేదు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి మధు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అడపాదడపా లేఖలు రాస్తూ మిగిలిన అంశాలు తమకేమి పట్టనట్లు వుంటున్నారు.ఈ వైఖరిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇది వరలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మధు ఆపరేషన్ చేసుకొని వుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శ చేశారు. అప్పుడే ఏదో జరగబోతోందని భావించిన వారు లేక పోలేదు. దాని కొన సాగింపుగానే కావచ్చు. కాక పోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున మార్క్సిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తికి అడ్వర్ టైజ్ మెట్లు ఇస్తున్నారు. అందుకు కృతజ్ఞతగా పత్రికలో వైకాపా పత్రిక సాక్షి కన్నా ఒక ఆకు ఎక్కువగా ఫ్రంట్ పేజీలో జగన్మోహన్ రెడ్డి వార్తలు వస్తున్నాయి.

గాని ఇంత కాలం పరస్పరం ఒకటిగా వుంటున్న కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీలు ప్రస్తుతం చెరో దారి పట్టడమే అసలు సమస్య. ఆ మాట కొస్తే రాష్ట్ర విభజన అంశంలో తప్ప మిగిలిన అన్ని అంశాలపై రెండు పార్టీలు ఏకీభావంతో వ్యవహరించేవి. . మొన్న ఎన్నికల సందర్భంగా రెండు పార్టీలు జనసేనతో పయనించాయి. ఎన్నికల తర్వాత కూడా రెండు వామపక్షాలు జగన్మోహన్ రెడ్డి విధానాలపై ఒకే రకంగా స్పందించి సభలు సమావేశాలు నిర్వహించారు. కాని క్రమేణా మార్క్సిస్టు పార్టీ జగన్మోహన్ రెడ్డి విధానాలు వివాదాస్పద అంశాలపై మాట్లాడటం మానేసింది.

అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కె. రామ కృష్ణ మాత్రం వైకాపా ప్రభుత్వం విధానాలపై తీవ్ర స్థాయిలో దండెత్తారు. దీనికి తోడు తెలుగుదేశంతో కలిసినడిచేందుకు సిద్ధమైనారు. ఈ దెబ్బతో రామ కృష్ణ వైకాపాకు కంటిలో నలుసు అయ్యారు. ఈ నేపథ్యంలో వైకాపా కూడా తన సహజ ధోరణిలో రామ కృష్ణ బిసి అయినా చౌదరి పేరు తగిలించి సోషల్ మీడియాలో చెలరేగి పోయింది. ఈ పరిణామమేమంటే వైకాపాకు వ్యతిరేకంగా రామ కృష్ణ బహిరంగ యుధ్దమే ప్రకటించ వలసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కులంతో బ్లాక్ మెయిల్ చేస్తోందని ఎదురు దాడి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఎందుకు కేసుపెట్ట లేదని రామ కృష్ణ కీలకాంశాన్ని తెర మీదకు తెచ్చారు. దీని పర్యవసానం మాత్రమే ముఖ్యమైనది. మార్క్సిస్టు పార్టీ కూడా రామ కృష్ణతో గొంతు కలపక పోతే రెండు పార్టీలు వేర్వేరు దారులు పట్టినట్లు భావించాలి. ఆ దిశగా మార్క్సిస్టు పార్టీ వైఖరి వున్నట్లు లేదు. వైకాపా ప్రభుత్వం యెడల మార్క్సిస్టు పార్టీ తీసుకుంటున్న వైఖరిపై వారి కేడర్ లో కూడా చర్చ నడుస్తున్నట్లు చెబుతున్నారు.

ఇంత వరకు సహజంగా వామపక్ష నేతలపై ఎవరైనా తీవ్ర విమర్శలు చేస్తే మరో వామపక్షం ఖండనలు చేసిన సందర్భాలున్నాయి. . ఇటీవలగా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రామ కృష్ణపై కులం వ్యాఖ్యలు వెలువడినా మార్క్సిస్టు పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించ లేదు. అంటే తమ తోటి వామపక్షంపై వైకాపా చేస్తున్న విమర్శలను తప్పు పట్ట లేదు.

రామ కృష్ణకు అనుకూలంగా ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి వద్ద మాట పడాలసి వుంటుందని మౌనం పాటించుతున్నారనే ప్రచారం లేక పోలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో రెండు వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం యెడల వేర్వేరుగా దారులు తొక్కనున్నారు. గమనార్హమైన అంశమేమంటే ఇదే నిజమైతే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రాజకీయంగా ఒక మిత్రుడు దొరికినట్లవుతుంది. రాష్ట్రంలో సంభవించుతున్న ఈ పరిణామాలు మరింత తీవ్రతరం అయితే వామపక్షాలు ట్రేడ్ యూనియన్ రంగం వరకు వీరి ఐక్యత పరిమితమౌతుంది.