భవిష్యత్తును దర్శించడం, ఆ భవిష్యత్తును అందుకోవాలని ప్రయత్నించడం, తన తోటివారికి కూడా అందని ద్రాక్ష వంటి భవిష్యత్తును అందించాలనుకోవడం ఉత్తమ రాజనీతికోవిదుల లక్షణం. ఒకనాడు చందమామను అద్దంలో మాత్రమే చూసి మురిసిపోయిన మానవుడు చివరకు ఆ చందమామ మీద పాదం మోపి తన స్వప్నాలను నిజం చేసుకోగలిగాడు. “మానవుడే తలచినచో గిరులనెగురవేయడా…మానవుడే తలచినచో నదుల గతులు మార్చడా” అన్నారు మహాకవి శ్రీశ్రీ. తాను కన్న కలలన్నింటినీ కృషితో సాకారం చేసుకోవడం ఒక్క మానవుడికే సాధ్యం.
ప్రజాహితం కోరి సంస్కరణలను ప్రవేశపెట్టడం, ప్రజలను ఒప్పించడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చెయ్యడం ఉత్తమ పాలకుల ప్రధాన లక్షణం. అందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారు వెరవరు. ఒక ప్రయత్నం విఫలం అయితే మరొక ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా కుదరకపోతే మరొకసారి ప్రయత్నిస్తారు తప్ప కాడి కింద పడెయ్యరు. ఇలాంటి ధీరులు, ధైర్యవంతుల గూర్చి స్తుతిస్తూ ఏనుగు లక్ష్మణ కవి “ఆరంభించరు నీచమానవులు ….” అనే పద్యాన్ని రచించారు. కార్యసాధకుడు ఎప్పుడూ ఆటంకాలకు భయపడడు. ఎన్ని ప్రయత్నాలు చేసైనా ఒకసారి మొదలు పెట్టిన కార్యాన్ని పూర్తి చేసేదాకా విశ్రమించడు అని చెబుతాడు. సంస్కరణలను ప్రవేశపెట్టడం సులభమే కావచ్చు. కానీ సమాజాన్ని ఒప్పించడం చాలా జటిలమైన పని. విధవా వివాహాలు అనే సంస్కరణలను కందుకూరి వీరేశలింగం పంతులు మొదలు పెట్టినపుడు ఛాందసవాదులు, శ్రోత్రియులు ఆయన మీద విరుచుకుని పడ్డారు. తెలుగు భాషను వ్యవహారికంలోకి మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రయత్నించినపుడు గ్రాంధిక భాషావాదులు ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. అలాగే సతీసహగమనాన్ని నిషేధించడానికి రాజా రామ్మోహన్ రాయ్ ఉద్యమించినపుడు ఆయనకు కూడా సంప్రదాయవాదులనుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇంకా వెనక్కు వెళ్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్క చెయ్యక తాము అనుకున్నది సాధించిన ధీరులు చరిత్రలో ఎందరో కనిపిస్తారు. వారు ఎందుకు తమ ప్రయత్నాలను విరమించుకోరు అంటే వారు పాటుపడేది తమ స్వార్ధం కోసం కాదు. సమాజ పురోభివృద్ధి కోసం కాబట్టి!
జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువ ముఖ్యమంత్రి, అత్యున్నత విద్యావంతుడు, అభ్యుదయభావాలు కలిగినవాడు, సుదీర్ఘపాదయాత్రలో లక్షలాదిమంది ప్రజల హృదయాల తలుపులను తట్టి వారి కష్టనష్టాలను ఆకళింపు చేసుకుని, తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏమి చేయగలనో ప్రజలకు చెప్పుకున్నారు. ఆయన విశాలభావాలను, ప్రజాసేవానురక్తిని, ఆయన కుటుంబ చరిత్రను, వారికున్న విశ్వసనీయతను ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారు. విద్యారంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన మార్పును తీసుకొస్తానని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టి నిరుపేదవిద్యార్థులకు కూడా నయాపైసా ఖర్చు లేకుండా ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొస్తానని, తద్వారా పేదపిల్లలు కూడా ప్రపంచంతో పోటీపడి అభివృద్ధి సాధించేలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఒక వాగ్దానాన్ని చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు.
ఇక అప్పటినుంచి ధనికవర్గాలలో, కార్పొరేట్ శక్తులలో హాహాకారాలు మొదలయ్యాయి. ఆంగ్ల విద్య అనేది ప్రయివేట్ పాఠశాలలకు మాత్రమే పరిమితం కావాలని, డబ్బున్న వారి పిల్లలకు మాత్రమే ఆ విద్య అందుబాటులో ఉండాలని, అట్టడుగు వర్గాల వారు కూడా తమకు పోటీ వస్తే తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని, అంతేకాక, తమ కింద పని చెయ్యడానికి, తమ అడుగులకు మడుగులు ఒత్తడానికి, తమకు మంచినీళ్లు, కాఫీలు, టిఫిన్లు తెచ్చిపెట్టే అటెండర్లు, గుమాస్తాలు దొరకరేమో అని భయపడిపోయారు. అంతే కాదు…కోట్ల రూపాయల పెట్టుబడులతో, రాజకీయ ప్రాపకంతో తాము పెట్టుకున్న పరిశ్రమల లాంటి పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలు పోటీ అవుతాయేమో అని ఆందోళన చెందారు. నర్సరీ తరగతుల నుంచే లక్షల రూపాయల ఫీజులను వస్తూలు చేస్తూ తల్లితండ్రుల రక్తమాంసాలను జుర్రుకుంటూ కోట్లకు పడగలెత్తే అవకాశం కోల్పోతామేమో అని భీతి చెందారు. ఎంత చెప్పినా, ప్రభుత్వ పాఠశాల్లో నియమించబడే ఉపాధ్యాయులు మంచి శిక్షణ పొంది ఉంటారు. బోధనలో వారు ఎవ్వరికీ తీసిపోరు. తల్లితండ్రులకు కూడా ఆ విషయం తెలుసు. అయితే లేనిపోని ప్రతిష్టకు పోయి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా ఎవరినో చూసి ఆస్తులను అమ్మేసి అయినా సరే, తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చుతున్నారు. తల్లితండ్రుల బలహీనతలను కార్పొరేట్ శక్తులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ కార్పొరేట్ పాఠశాలల్లో చాలావరకు రాజకీయపార్టీలు, నాయకులతో సంబంధాలు కలిగి ఉంటాయి. కొన్ని పాఠశాలల యాజమానులు నేరుగా రాజకీయాల్లో వివిధ పార్టీల్లో ఉంటాయి. వీరిలో వారి దోపిడీ శక్తిని బట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా అవుతున్నారు!
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగానే కార్పొరేట్ శక్తులు న్యాయస్థానాలలో పిటీషన్లు వేశాయి. ఇక చంద్రబాబు గారి సామాజికవర్గానికి చెందిన మీడియా అయితే, కేవలం హిందువులను క్రైస్తవమతంలోకి మార్చడం కోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లవిద్యను తెస్తున్నారని విషం చిమ్మాయి. అయితే ఆ కుట్రలు ఫలించలేదు. ఆ తరువాత ఆంగ్లమాధ్యమం వలన తెలుగుభాష కనుమరుగవుతుందని, మాతృభాషలో విద్యాబోధన జరగాలని రాజ్యాంగం చెబుతున్నది అంటూ కోర్టుకెక్కారు. మరి ఈ రాజ్యాంగ నిబంధన కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా? ప్రయివేట్ పాఠశాలలకు వర్తించదా అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధిస్తున్నపుడు మరణించిని తెలుగు భాష ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తే మరణిస్తుందా? తెలంగాణాలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమమే అమలులో ఉన్నది. అక్కడ చావని తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ లో ఎలా చనిపోతుంది అని మేధావులు సైతం నిలదీస్తున్నారు.
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక సూక్ష్మం బోధపడుతుంది. చంద్రబాబుకు మొదటినుంచి కూడా తెలుగు భాష మీద చాలా చిన్నచూపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ట్స్ గ్రూపులు తీసెయ్యాలి అని ఒక ప్రకటన చేశాడు. అప్పట్లో ఆ ప్రకటనకు గట్టి ప్రతిఘటన ఎదురైంది. అదృష్టం బాగుండి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో చంద్రబాబు కోరిక కూడా చచ్చిపోయింది. 2014 లో చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మంత్రివర్గంలో అతి ముఖ్యంగా వ్యవహరించిన మంత్రి పొంగులేటి నారాయణ “తెలుగు మీడియంలో చదివితే భవిష్యత్తు శూన్యం” అని నిస్సిగ్గుగా ప్రకటించాడు. మరి ఇప్పుడు వారికి తెలుగు అంటే హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది? తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని, తల్లితండ్రుల రక్తాన్ని జుర్రుకునే మహత్తర అవకాశం పోతుందని వెఱ్ఱిభయం! వారి స్వార్ధం కోసం సమాజం నాశనమై పోయినా సరే, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైపోయినా సరే, వారికి లక్ష్యం లేదు.
అయితే ఇలాంటి అడ్డంకులు ఎన్ని కల్పించినప్పటికీ, జగన్ మాత్రం తన లక్ష్యం నుంచి అణుమాత్రం కూడా తప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కోర్ట్ ఆదేశించిన ప్రకారం తల్లితండ్రుల నుంచి అభిప్రాయసేకరణ చేశారు. దానిలో సుమారు తొంభైఆరు శాతం మంది ఆంధ్లమధ్యమానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆంగ్ల మాధ్యమం అనివార్యం అయినప్పటికీ, దానితో పాటు తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ గా ఉంటుందని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏదో విధంగా ఒక యువ నాయకుడి ఆశయాలకు తూట్లు పొడవడానికి కార్పొరేట్ శక్తులు వివిధ వ్యవస్థలలో గల తమ అనుకూలురతో సకలయత్నాలు చేస్తున్నాయి. కేవలం మాతృభాషలో చదివితే విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలబడలేరని, ఆంగ్లంలో పట్టు లేకపోతే ఉద్యోగాల నిమిత్తం దేశవిదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండదని గౌరవ న్యాయస్థానాలు కూడా గ్రహించలేకపోవడం మరీ విషాదకరం.
బుద్ధికుశలత కలిగిన ఆలోచించగలిగిన పౌరులు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే…ఒక విద్యాధిక ముఖ్యమంత్రి మెరుగైన సమాజం కోసం, నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తానని, తద్వారా వారిని అత్యున్నత పౌరులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇవ్వడం నేరమా? దేశద్రోహమా? క్షీరసాగరమధనం తరువాత దేవతలు పాలసముద్రంలోని రత్నాలతో తృప్తి చెందలేదు. బుసలు కొడుతూ వెలువడిన కాలకూట విషానికి భయపడలేదు. లక్ష్మీదేవి, కామధేనువులతో కూడా సంతృప్తి చెందలేదు. తాము కోరుకున్న అమృతభాండం లభించేవరకూ కృషి చేశారు. ధీరులు కూడా అంతే. తమ లక్ష్యాన్ని సాధించేదాకా నిద్రపోరు. పట్టు వీడరు. జగన్మోహన్ రెడ్డి ఈ కోవలోకి వస్తారు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు