ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం వేదికగా జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఈ సదస్సులో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు దఖలు పడ్డాయని ఆయన తెలిపారు.
మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని సీఎం చంద్రబాబు వివరించారు.
శ్రీసిటీలో మరిన్ని యూనిట్ల ప్రారంభం – రూ.22 లక్షల కోట్లకు చేరిన పెట్టుబడులు
ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీలో ఏర్పాటు చేసిన మరికొన్ని యూనిట్లను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 12,365 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.
అదనంగా 6 వేల ఎకరాల భూమి కేటాయింపు: శ్రీసిటీకి అదనంగా 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు సీఎం తెలిపారు.
డైకిన్, ఇసుజూ, క్యాడ్‌బరీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ నుంచి ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీసిటీ అభివృద్ధికి ఒక నమూనాగా మారుతుందని, 2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

2014-19 మధ్య కాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని సీమకు తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో రేమాండ్స్ గ్రూప్‌కు చెందిన రూ.3,500 కోట్లకు పైగా పెట్టుబడులుతో మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రేమాండ్స్ గ్రూప్ రాష్ట్రంలో మొత్తం రూ.1,201 కోట్ల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులను అనంతపురం జిల్లాలో నెలకొల్పనుంది.
రాప్తాడు: రూ.497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అపారెల్ పార్క్.
గుడిపల్లి: రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ ప్లాంట్.
టెకులోడు: రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్.
రేమాండ్స్ సంస్థ 2027 నాటికి తమ ప్రాజెక్టులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చిందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేమాండ్స్ గ్రూప్ ప్రతినిధి గౌతమ్ మైనీ, ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు, పరిశ్రమలకు అనుమతులు చాలా వేగంగా లభిస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ కె.విజయానంద్, శ్రీసిటీ ఎండీ రవి సానారెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
https://www.youtube.com/watch?v=6wzfPxSiiB8
