రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సరైనోడు: మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.!

దాపరికం ఏమీ లేదు. తమ్ముడికి తెరవెనుకాల సహాయ సహకారాలు అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమైపోయారు. ఇకపై వైసీపీ శ్రేణులు, మెగాస్టార్ చిరంజీవిపైనా విమర్శలు చేయక తప్పదేమో. ‘మెగాస్టార్ చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి..’ అని ప్రశంసిస్తూ వచ్చిన వైసీపీ నేతలు, ఇకపై స్వరం మార్చాల్సిందే.

‘నేను రాజకీయాలకు తగను. ఆ రాజకీయాల్లో నేను ఇమడలేను. అందుకే, రాజకీయాల్లోకి వెళ్ళినట్లే వెళ్ళి వచ్చేశాను. పవన్ కళ్యాణ్ మాత్రం సరైనోడు. మొండితనం కలిగినోడు. మాటలు అంటాడు, మాటలు పడతాడు. అలాంటోళ్ళే రాజకీయాల్లో రాణించగలరు. ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్‌ని అత్యున్నత స్థానంలో చూస్తాం. మీ అందరి ఆశీస్సులు వుండాలి..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లో వైఎన్ఎం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో మెగాస్టార్ పై వ్యాఖ్యలు చేశారు.

2009 ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరమయ్యారుగానీ, చిరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యుడయ్యారు, కేంద్రమంత్రిగా పనిచేశారు.

రాజ్యసభ పదవీ కాలం ముగిశాక రాజకీయాలు వదిలేశారు చిరంజీవి. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు మెగాస్టార్. కానీ, 2024 ఎన్నికల్లో చిరంజీవి తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రత్యక్షంగా కాకపోయినా, తమ్ముడికోసం తెరవెనుక రాజకీయాలు చేయనున్నారు చిరంజీవి. దానికి పై వ్యాఖ్యలే నిదర్శనం.