ఒక ఉద్యమాన్ని నిర్మించి, పదునాలుగేళ్లపాటు నిలబెట్టి, లక్ష్య సాధన అయిన ప్రత్యేకరాష్ట్రాన్ని సాకారం చేసుకోవడం బహుశా స్వాతంత్య్రానంతరం ఒక్క తెలంగాణ విషయంలోనే జరిగిందనుకుంటాను. ఆ ఉద్యమానికి సారధ్యం వహించి నాలుగు కోట్లమంది తెలంగాణవారి హృదయాల్లో పన్నీటిజల్లులు నింపి వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసినవారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్).
కరెంట్ కోతలు చూడలేదు
రాష్ట్ర సాధన తరువాత ప్రధానంగా కనిపించిన సమస్యలు రెండు. విద్యుత్, నీరు. రాష్ట్రం విడిపోతే కరెంట్ కోతలు ఏర్పడతాయని, తాగునీరు లభించదని చాలామంది భయపడ్డారు. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి హోదాలో కరెంట్ సమస్యలు రెండు మూడేళ్లపాటు తప్పవని ప్రకటించారు. కానీ, అనూహ్యంగా ఏం మాయచేసారో తెలియదు కానీ, రాష్ట్రం సిద్దించినప్పటినుంచి ఈరోజు వరకు కరెంట్ పోతే ఒక వింత అని చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇక ఇంటింటికి తాగునీరు దిగ్విజయంగా అందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒంటిచేత్తో రాష్ట్రనిధులతో పూర్తిచేసి కోటి ఎకరాలను సస్యశ్యామలం గావించడం ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఫీట్. రైతుబంధు పధకాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టి రైతుబాంధవుడు అనిపించుకున్నారు ఆయన. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలల్లో ఆంగ్లమీడియంలో బోధన, ఉచిత విద్యుత్, షి టీమ్స్, ఫ్రెండ్లి పోలీసింగ్ లాంటి అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలతో కేసీఆర్ పాలనలో దూసుకుని వెళ్తున్నారు.
ఇతరులకు క్రెడిట్ ఇచ్చే అరుదైన లక్షణం
కేసీఆర్ లోని మరొక గొప్ప సుగుణం ఏమిటంటే ఆయన ఎన్ని విజయాలు సాధించినా స్వోత్కర్షలకు దూరంగా ఉంటారు. “నేనే చేశాను” అని చెప్పుకోరు. “మా ప్రభుత్వం చేసింది” “మా మంత్రిగారు ఆ పని చేశారు”…”మా ఎమ్మెల్యే గారు ఫలానా కార్యక్రమం కోసం నిధులకోసం నామీద ఒత్తిడి తెచ్చి సాధించుకున్నారు” ” మా అధికారులు అద్భుతంగా పనిచేశారు” అంటూ బహిరంగవేదికలమీదనే వారిని ప్రశంసించే మంచి లక్షణం కలిగిన అరుదైన ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలుగు భాషకు పట్టం కట్టిన ముఖ్యమంత్రి
కేసీఆర్ గొప్ప భాషాభిమాని. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగలరు. ఆయన వాగ్ధాటి కూడా చాలా అమోఘంగా ఉంటుంది. మధ్యమధ్య చమత్కారాలు, పిట్టకథలు, సామెతలు, నుడికారాలు కొండమీదినుంచి దుమికే సెలయేళ్ళను గురుతుకు తెస్తాయి. భాషపట్ల ఆయనకున్న మమకారమే 2017 లో ప్రపంచ తెలుగు మహాసభలను వైభవంగా నిర్వహించేట్లు చేసింది. తేటతెనుగులో, తెలంగాణ యాసలో ఆయన మాట్లాడుతుంటే తెలుగువారందరూ మంత్రముగ్ధులై వినాల్సిందే. కేసీఆర్ మార్క్ పంచెస్ కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తుంటారు.
మంచితనం పాళ్ళు అధికం
వ్యక్తిగతంగా కూడా ఎవరిమీద కోపతాపాలు మనసులో పెట్టుకోరు. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మహోధృతంగా సాగిస్తున్నప్పుడు ఆయనను తీవ్రపదజాలంతో విమర్శించినవారిని సైతం రాష్ట్రం ఏర్పడినాక సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించడమే కాక వారు కూడా తెలంగాణ బిడ్డలే అనే ఉదారత్వాన్ని ప్రదర్శించి ఉన్నతమైన పదవులను కట్టబెట్టారు. ఎవ్వరిపట్లా కటువైన భాషను వినియోగించరు.
దైవభక్తి విపరీతం
ఆయనకు దైవభక్తి మెండు. అందుకే శతాబ్దాల కాలంగా చిన్న గుడిలా ఉన్న యాదాద్రిని పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో, కళ్ళు మిరుమిట్లు గొల్పే శిల్పకళావైభవంతో మరో వెయ్యేళ్లవరకు చెక్కుచెదరని రీతిలో నిర్మించి ఆశ్చర్యచకితులను చేశారు. మరో తిరుపతిలా కేవలం ఐదేళ్లలో ఆలయాన్ని పునర్నిర్మించారు. రాజరికంలో మహారాజులు, చక్రవర్తులు ఆలయాలను నిర్మించారని చరిత్రలో చదువుకున్నాము. కానీ ఈ కాలంలో ఎవ్వరి విమర్శలకు జడవక యాదాద్రిని నిర్మించి నాటి చోళులు, పల్లవులను, విజయనగర చక్రవర్తులను తలుపుకు తెచ్చారు. వ్యక్తిగత ఖర్చుతో అనేక యాగాలు చేశారు.
ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి తెలుగురాజ్యం.కామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు