మామా వచ్చితిమి మేము… నీ ‘దక్షిణ’ గుట్టు విప్పెదము!

నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 విజయకేతనం ఎగురవేసింది. వెన్నెల పురివిప్పే జాబిలి ‘దక్షిణ’ గుట్టు విప్పేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం ఆశ్చర్యంగా భారత్ వైపు చూస్తూ అభినందిస్తుంటే… భారత్ మాత్రం చంద్రుడి వైపు చూస్తూ… “మామా వచ్చితిమి మేము” అని అంటుంది!

ఈ సమయంలో జూలై 14 నుంచి ఆగస్టు 23 వరకూ చంద్రయాన్- 3 సాగించిన ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం!

చివరి నిమిషంలో చంద్రయాన్ – 2 చెదిరించిన స్వప్నాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం4 ని ఆకాశంలోకి పంపింది.

ఈ సమయంలో చంద్రయాన్ – 3 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. ఆ క్షణమే ఈ క్షణాన్ని చాలా మంది ఊహించారు! ఈసారి ఎలాగైనా ‘మామ’ను చేరాలని తపించిన ప్రయత్నం సాకరమైంది. ఈసమయంలో జూన్ 15న తొలిసారి దీని కక్ష్యను పెంచారు శాస్త్రవేత్తలు.

ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. ఇందులో భాగంగా అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న “ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య”లోకి ప్రవేశపెట్టారు. అనంతరం ఆగస్టు 5న విజయవంతంగా “చంద్రుడి కక్ష్య”లోకి చేర్చారు.

ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయింది. ఫలితంగా సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ-అర్బిట్‌ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.

ఈ క్రమంలో ఆగస్టు 23 సాయంత్రం 5:44 గంటల ప్రాంతంలో ల్యాండింగ్‌ ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది ల్యాండర్‌ మాడ్యూల్‌. అనంతరం తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ మొదలుపెట్టింది. ఆ తర్వాత ల్యాండర్‌ మాడ్యూల్‌ తన దిశను మార్చుకుంది.

ఈ సమయంలో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్‌ కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపింది.

ఫలితంగా… అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని ద్రాక్షగా ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారతదేశం అవతరించింది.

అనంతరం… దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

వాట్ నెక్స్ట్:

చంద్రయాన్ – 3 మోసుకెళ్లిన విక్రమ్‌, ప్రగ్యాన్‌ ల జీవితకాలం 14 రోజులే. అందుకే చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఇవి గుణాత్మక, నిర్మాణాత్మక మూలకాలను విశ్లేషించడంతోపాటు.. జాబిల్లిపై ఉన్న మట్టిలోని రసాయన మూలకాలు, ఖనిజ సంపదను గుర్తించడంలో దోహదపడుతుంది.

ఇదే సమయంలో ల్యాండింగ్‌ అయిన ప్రదేశంలోని మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తించడం.. ముఖ్యంగా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి మూలకాలను గుర్తించే పనిలో నిమగ్నమవుతుంది.