మునిసిపల్, పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగానే వచ్చిపడింది. పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టిగా పోటీ ఇచ్చామని ఓ పక్క చెబుతూనే, ఇంకోపక్క.. బెదిరింపులకు గురిచేసి తమ విజయాన్ని అడ్డుకున్నారంటూ అధికార పార్టీ నేతలపై తెలుగు తమ్ముళ్ళు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి గురించి అందరికీ తెలిసిందే.
టీడీపీ ఎంతగా బుకాయించినా, ఆ పార్టీ పంచాయితీ ఎన్నికల్లో చతికిలపడిపోయిందన్న వాస్తవం అందరికీ అర్థమవుతూనే వుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మిగతా స్థానిక ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతాయి గనుక, చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రచారంలోకి దిగబోతున్నారు. అయితే, చంద్రబాబు ప్రచారం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని గ్రౌండ్ లెవల్‌లో తెలుగు తమ్మళ్ళు కొందరు వాపోతున్నారట. పార్టీల గుర్తుల మీద జరిగే ఎన్నికలే అయినా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అవగాహనలు జరుగుతుంటాయి ఈ స్థానిక ఎన్నికల్లో కూడా. చంద్రబాబు పర్యటనలతో, ఆయన ప్రసంగాలతో ఆ ఈక్వేషన్స్ చెడిపోవచ్చన్నది కొందరు తెలుగు తమ్ముళ్ళ ఆవేదనగా కనిపిస్తోంది. కాగా, జీవీఎంసీ అలాగే విజయవాడ, తిరుపతి వంటి చోట్ల టీడీపీ పరిస్థితి చావో రేవో అన్నట్టు వుండబోతోంది. అమరావతి సెగ అధికార పార్టీకి విజయవాడలో వుండొచ్చు. తిరుపతిలోనూ రాజకీయాలు అనూహ్యంగా మారాయి. అయితే, ఇవేవీ తెలుగుదేశం పార్టీకి అనుకూలతల్ని తీసుకొస్తాయని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, జనసేన పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారుతూ ప్రతిపక్షం తాలూకు స్థానాన్ని సొంతం చేసుకుంటోంది. దాంతో, జనసేనను దెబ్బ కొట్టడం అనే లక్ష్యంతో ఇప్పటికే టీడీపీ వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అదెలాగూ అధికార పార్టీకి లాభం చేకూర్చేదే అవుతుంది.