“టీ”లో బాబు చూపులు… వారి వీపులకు గుచ్చుకుంటాయా?

ఓటుకు నోటు ప్రభావం పోయిందనుకున్నారో.. లేక, టి.ప్రజలౌ బాబు చేసిన పనులు మరిచిపోయి ఉంటారని భావించారో ఏమో కానీ… ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రకటిస్తే ప్రకటించారు… ఇప్పటికే 100 సీట్లలో అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. చెబితే చెప్పారు.. వారు ఎవరెవరు అనే విషయం చెప్పలేదుగా అనుకునేలోపు.. ఇంకో పెద్ద మాట అనేశారు చంద్రబాబు! అదెంటయ్యా అంటే… తెలంగాణలో అధికారంలోకి రావాలి అని!

అవును… తెలంగాణలో పసుపు జెండా ఎగరాలని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని తెలంగాణ టీడీపీ నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ప్రసంగంలో ఈ మెరకు ఆయన కేడర్ కు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మైకందుకున్న చంద్రబాబు… తెలంగాణకు టీడీపీ చాలా చేసిందని, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, సంక్షేమానికి నాంది పలికిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో… కృష్ణా – గోదావరి అనుసంధానం ప్రాజెక్టు చేపట్టామని.. నదుల అనుసంధానం చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని… కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినె వ్యక్తులు చెప్పే కబుర్లు చెబుతున్నారు చంద్రబాబు. ఎందుకంటే… ఉమ్మడిరాష్ట్రంలో బాబు సీఎంగా రెండు దఫాలు పనిచేశారు.

అక్కడితో ఆగని బాబు… ప్రజలతోనే పార్టీ నడపాలనేది తన సంకల్పమని.. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామని.. తెలుగుజాతి మొత్తం గ్లోబల్ సిటిజన్ గా మారారని చెబుతున్నారు. ఇదే క్రమంలో… తెలంగాణలోని ప్రతిగడపా ఇప్పుడు టీడీపీని కోరుకుంటోందని కూడా చెప్పే సాహసం చేసిన బాబు… వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థులు ఉన్నారని.. తాజాగా జ‌రిగిన టీడీపీ ఆవిర్భావ స‌ద‌స్సులో వెల్లడించారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాలి.. అని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

అయితే.. వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంద‌న్న ప్రకటన వెనుక ఉన్న మర్మమేమిటి అనేది ఇప్పుడు ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. తాను.. ఎవ‌రితోనైనా పొత్తుకు రెడీ అని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారా? లేక, వ‌చ్చే ఎన్నికల్లో తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీకి సైతం 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్యర్థులు లేరు అని ఫిక్సవుతూ.. పొత్తుకు హింట్ ఇస్తున్నారా? అంటే… అవునని అంటున్నారు తమ్ముళ్లు! ఎందుకంటే… తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో బలంగా, ఒంటరిగా రంగంలోకి దిగబోతుంది.

ఈ నేప‌థ్యంలో ప‌రోక్షంగా బీజేపీని ఉద్దేశించి.. చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే… బీజేపీతో కలవాలని బాబు చేయని ప్రయత్నం లేదు. కేంద్రంలో మోడీ ఏమి చేసినా కరెక్ట్ అంటూ సైలంటుగా ఉండటం కూడా ఆ ఆకర్షణలో భాగం. మరి ఈలెక్కన తెలంగాణలో బీజేపీ వైపు ఓరచూపు చూస్తున్న చంద్రబాబు చూపులు… టి.బీజేపీ నేతల వీపుకు గుచ్చుకుంటాయో లేదో చూడాలి!