చంద్రబాబు కొత్త కబుర్లు: నవ్వాలా… ఏడవాలా…?

గతకొంతకాలంగా చంద్రబాబు నాయుడు చెబుతోన్న మాటలపట్ల నవ్వాలో ఏడవాలో తెలియడం లేదనే వ్యాఖ్యలు తాజాగా తెరపైకి వస్తోన్నాయి. తాను ముఖ్యమంత్రి అయితే… అంటూ ఇప్పుడేదో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్లుగా చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలు చికాకు తెప్పిస్తున్నాయన్నా అతిశయోక్తి కాదని అంటున్నారు.

అవును… 14 ఏళ్లు ఉమ్మడి, విభ‌జిత ఆంధ్రప్రదేశ్‌ కు ముఖ్యమంత్రిగా ప‌ని చేసిన ఘ‌న‌త త‌న‌కే ద‌క్కుతుంద‌ని చంద్రబాబునాయుడు అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే దానివల్ల రాష్ట్రానికి ఏమి ఒరిగిందో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఒలెంపిక్స్ లో మెడల్స్ వస్తే అది తన క్రెడిట్ అని, సత్తె నాదేళ్ల గూగుల్ సీఈఓ అయితే అది తనవల్లే అని చెప్పుకుని నెట్టుకొస్తున్నారు.

దీంతో సుదీర్ఘ కాలం పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ప‌ని చేసే అదృష్టం చంద్రబాబుకు దక్కడం… ఏపీవాసుల దుర‌దృష్టం అనే వాళ్ల సంఖ్య త‌క్కువేం కాదు. ఎందుకంటే… ఇప్పటికీ ఈ వయసులో 40ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటూ, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషి తాజాగా చెబుతున్న కొత్త కబుర్లు వింటే కచ్చితంగా అది ఏపీవాసుల దురధృష్టమే అనిపించకమానదు!

తాజాగా చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సంద‌ర్శన‌కు బ‌య‌ల్దేరారు. ఇందులో భాగంగా మొద‌టి రోజు ఉమ్మడి క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల హెడ్ రెగ్యులేట‌ర్‌ ను సంద‌ర్శించారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన… రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయి.. వీటిని అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు అనేది ఉండదు. నదుల అనుసంధానం చేస్తే గోదావరి నీళ్లు నేరుగా బ‌నకచర్లకు వస్తాయి అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో దేశంలోనే త‌క్కువ వ‌ర్షపాతం న‌మోద‌య్యే జిల్లా కర్నూలు అని చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఆయనకు ఆ విషయం ఇప్పుడే తెలిసిందో.. లేక, ఇంతకాలం తెలిసే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్లక్ష్యం వహించినట్లు ఒప్పుకుంటున్నారో తెలియదు కానీ… పోతిరెడ్డిపాడు ఎస్సార్‌బీసీ విస్తరణ అటకెక్కిందని ఇప్పుడు చెబుతున్నారు.

అనంతరం… అవుకు టన్నెల్ పనులు పూర్తి చేసి, అవసరమైన మరో టన్నెల్ తవ్వి గండి కోటకు నీళ్లు ఇచ్చామని.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి మరో రెండు పంపులు పెట్టాలని.. ఆర్డీఎస్ గుండ్రేవుల ప్రాజెక్టుల కోసం జ‌గ‌న్ ప్రభుత్వం ఒక పైసా కూడా ఖర్చు చేయలేదని.. నదుల అనుసంధానం చేస్తూనే నల్లమల అడవుల్లో ఓ టన్నెల్ నిర్మించి గోదావరి నీళ్లు బ‌నకచర్లకు తీసుకురావడమే తన జీవిత లక్ష్యం అని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.

ఇలా జీవిత లక్ష్యం.. ఈ వయసులో, ఇంతవయసు వచ్చాక గుర్తుకురావడం దారుణం అని అంటున్నారు పరిశీలకులు. కేవలం ఆరాటం, పోరాటం, మరోసారి సీఎం కుర్చీ ఎక్కాలన్న తపనలో భాగంగా… ప్రజలను ఏమార్చే పనిలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అంతకు మించి మరో ఉద్దేశ్యం లేదని.. ఉన్నంతకాలం సిన్సియర్ గా పనిచేసి ఉంటే… ఈ వయసులో ఓట్ల కోసం ఇన్ని వేషాలు వేయాల్సిన అవసరం రాకపోయేదని మరికొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

దీంతో… మ‌రి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేసిన‌ట్టు? ఇప్పుడు అధికారం ఇస్తే రాయ‌ల‌సీమ‌ను స‌స్యశ్యామ‌లం చేస్తాన‌ని భారీ డైలాగ్‌ లు కొడుతున్నారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులు త‌న వాళ్లకు దోచి పెట్టడానికి పనిచేశారనే విమర్శను ఎదుర్కొన్న చంద్రబాబు… గ‌త ఐదేళ్లలో అమ‌రావతి నామ‌స్మర‌ణ త‌ప్ప, మ‌రే ప్రాంత అభివృద్ధిని ప‌ట్టించుకోకుండా… ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. ఫలితంగా ఫలితం 23కి దిగజారిపడిపోయింది.

ఈ క్రమంలో మరోసారి ఓట్ల కోసం మొస‌లి కన్నీళ్లు కార్చడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఇదే సమయంలో… చంద్రబాబు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఏపీ జనాలు ఏడవాలా… లేక, కొత్తగా చెబుతున్న కబుర్లు విని నవ్వాలా అనే సంశయంతో ఉండటం కొసమెరుపు.