నవ్వుల పాలవుతున్న నలభై ఎనిమిది గంటలు!!

chandra babu naidu

రాజధాని…. రాజీనామాలు… ఇవే ఇప్పటి హాట్ టాపిక్స్. రాజధాని మార్పుల విషయం రాజీనామాల వరకు వెళ్ళింది. అమీతుమీ తేల్చుకోడానికి చంద్రబాబు ఇచ్చిన సమయం 48 గంటలే. అందులో సగం గంటలు ఇప్పటికే గడిచిపోయాయి. ఆయన ఇచ్చిన గడువులోపు వైఎస్సార్ సిపి కి చెందిన 151  మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటున్నారు చంద్రబాబు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఆయన డిమాండ్.

అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే రాజీనామా చేయాల్సిన అత్యవసర పరిస్ధితులు ఇప్పుడు రాష్ట్రంలో ఏమున్నాయి? శాంతి భద్రతల సమస్య ఏర్పడి, ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారా? అధికార పార్టీలో చీలికలు వచ్చి,పరిపాలన స్తంభించి సంక్షోభ పరిస్ధితులు ఏర్పడ్డాయా? రాజధానుల వికేంద్రీకరణ అధికారం ప్రజల తీర్పుతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఉండదా? రాష్ట్ర ప్రభుత్వ అధికార విధులు రాజధాని ఉనికికి మాత్రమే సంబంధించిన విషయమా? ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఆ  ఐదేళ్ల పాటు అధికార బాధ్యతలు నిర్వహించకూడదా? 48 గంటలు ఏమిటి? ఇదేమైనా తుపాను హెచ్చరికా?

రాజధానిని వికేంద్రీకరించడం రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకమని చంద్రబాబు నాయుడు, ఆయన భజన బృందం తెగ బాధపడిపోతున్నారు. అయినా రాష్ట్ర విభజన చట్టాన్ని చంద్రబాబు అండ్ కో గౌరవించింది ఎక్కడ? రాజధాని ఎక్కడ అన్నది నిపుణుల కమిటీ సిఫార్సు చేస్తుందని చట్టంలో ఉన్నది. నిపుణుల కమిటీ అమరావతిలో రాజధాని పెట్టాలని సిఫార్సు చేసిందా? మీకు ఇష్టమైన నారాయణ కమిటీని వేసుకోమని చెప్పిందా? ”కేంద్రప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ” అని చట్టంలో స్పష్టంగా ఉంది. రాజకీయ నాయకుడైన నారాయణ నాయకత్వంలోని కమిటీ నిపుణుల కమిటీ అవుతుందా? పదేళ్ల పాటు, అవసరమైతే అంతకంటే ఎక్కువ కాలంపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండవచ్చు అని చట్టంలో ఉంది. రాజధాని షేరింగ్ విషయంలో సమస్యలు వస్తే గవర్నర్ పరిష్కరిస్తారని చెప్పి, శాంతి భద్రతల అంశాన్ని కూడా జాగ్రత్తగా అప్పగించింది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, హైదరాబాద్ నుంచి పాలించడానికి మొహం చెల్లక అమరావతి పరిసరాల్లో సంచరించి సొంత లాభ నష్టాల అంచనా వేసుకున్నది ఎవరు?  అప్పటి గవర్నర్ దయ తలచకపోతే ఆ కేసులో  చంద్రబాబు బాబు ఆనాడే అరెస్టయి ఉండేవారేమో?

రాజధాని కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు న్యాయస్ధానాల్లో ఊరట లభించ వచ్చు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్  ( ఒప్పంద ఉల్లంఘన ) జరిగింది కాబట్టి రైతుల వాదనకు బలం ఉంటుంది. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, తరలి పోయేవి సచివాలయం, హైకోర్టు మాత్రమేనని ప్రభుత్వం వాదిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో ఈ విషయం తేలేవరకు చంద్రబాబు నాయుడు వీధుల్లో తొడగొడుతూ, బస్తీ మీ సవాల్ అన్న స్థాయికి దిగజారిపోయి మాట్లాడడం మానుకోవాలి. ఆయన తన 48 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని 48 గంటల్లో పోగొట్టుకోవడం మంచిది కాదు.

—-శాంతారామ్