ఖర్గే సూపర్ చురక: సీబీఐ కి ఆపని రాదుగా..!

ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ప్రభుత్వ అసమర్ధతపై విమర్శలకు చెక్ పెట్టేందుకు… “కుట్ర” కోణాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ.. ఇదొక డ్రామా అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సీబీఐ మాజీ డైరెక్టర్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఈ సమయంలో రైల్వే ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ పై ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. సెటైర్లు వేశారు మల్లికార్జున ఖర్గే!

రైల్వే ప్రమాదంపై విచారించడానికి సీబీఐ ని రంగంలోకి దింపాలని రైల్వే మంత్రి సూచించిన సంగతి తెలిసిందే. ఈ డిమాండ్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో… ప్రధాని మోడీపై లేఖాస్త్రం సంధించారు ఏఐసీసీ అధ్యక్షుడు, రైల్వేశాఖ మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే! ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ కు మోడీ వరుసపెట్టి ఛాన్స్ లు ఇస్తున్నారనే కామెంట్లు మొదలైపోయాయి!

ఈ లేఖలో అనేక ప్రశ్నలు సంధించిన ఖర్గే… మరికొన్ని సందర్భాల్లో మోడీపై సెటైర్లు వేశారు.. వెటకార వైఖరిని ప్రదర్శించారు. అందుకు మోడీ అర్హుడనేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. అవును… “బాలాసోర్‌ ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నామని రైల్వే మంత్రి చెప్పినప్పటికీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించారో చెప్పాలి” అని మొదలుపెట్టిన ఖర్గే… “సీబీఐ ఉన్నది నేరాలపై దర్యాప్తు చేయడానికి తప్పితే రైలు ప్రమాదాల కోసం కాదు. పైగా… రాజకీయ వైఫల్యాలకు బాధ్యులెవరన్నది సీబీఐ తేల్చలేదు” అని చురకలు అంటించారు.

ఈ సందర్భంలో 2016లో కాన్పుర్‌ లో జరిగిన రైలు ప్రమాదాన్ని, ఆ ప్రమాదంపై మోడీ అనుసరించిన వైఖరినీ తెరపైకి తెచ్చారు ఖర్గే. కాంపూర్ లో 2016లో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 150 మంది చనిపోయారు. అప్పుడు కూడా ఇలానే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా… రైల్వే మంత్రి ఆ ప్రమాదంపై ఎన్.ఐ.ఏ. దర్యాప్తు కోరారు. కానీ 2018లో ఎన్.ఐ.ఏ. ఆ దర్యాప్తును మూసేసింది. ఛార్జిషీట్‌ దాఖలు చేయడానికి కూడా తిరస్కరించింది. నాటి ఘోరానికి కారకులెవరన్నది ఇప్పటికీ తెలియలేదు.

సరిగ్గా అదే పద్దతిలో తాజాగా జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైల్ ప్రమాదంలో కూడా దర్యాప్తు సంస్థలకు అప్పగించి డ్రామాలు ఆడుతున్నారన్నట్లుగా ఖర్గే ఉదాహరణలు చూపిస్తూ మోడీ సర్కార్ ను తూర్పారబట్టారు. “నాడు ఎన్.ఐ.ఏ. అన్నారు.. అది రిజల్ట్ రాలేదు. నేడు సీబీఐ అంటున్నారు.. ఇది కూడా అంతే. మీమీ అసమర్ధతను, చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దర్యాప్తు సంస్థలను బాగా వాడుకుంటున్నారు.. ప్రజలు గమనిస్తున్నారు” అని ఖర్గే సూటిగా చురకలు అంటించారు.