స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటినుంచీ ఏపీ బీజేపీలో ఒకవర్గం జగన్ సర్కార్ పై అక్కసు వెల్లగక్కుతుందని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క ఏపీలో చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల హస్తం ఉందని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో హస్తిన వేదికగా రాజకీయపరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇందులో భాగంగా పురందేశ్వరి.. ఏపీలో మధ్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షా ను కలిశారు.
ఏపీలో మధ్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని.. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని.. కల్తీమద్యం అమ్ముతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా… తాజాగా కేంద్ర హోంమంత్రిని కలిసిన పురందేశ్వరి… ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. వాస్తవానికి ఏపీలో ఈ విషయంపై పురందేశ్వరి రెండు మూడు సార్లు డిమాండ్లు చేశారు. దీంతో… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏపీ చీఫ్ గా ఉండి కూడా డిమాండ్ చేయడం ఏమిటనే విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అమిత్ షా ను కలిశారు పురందేశ్వరి. ఇందులో భాగంగా ఏపీలో మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఆ సంగతి అలా ఉంటే… మద్యం అవినీతిపై సీబీఐ విచారణకు సీఎం జగన్ సిద్ధమేనా అని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ సవాల్ విసిరారు. దీంతో… అవినీతి జరిగిందని భావిస్తే, కేంద్రం అనుమతిస్తే ధమ్ముగా విచారణ జరిపించుకోవాలి కానీ… “జగన్ సిద్ధమేనా” అని అనుమతి అడడం ఏమిటో వారికే తెలియాలి.
సరే ప్రశ్నిస్తే ప్రశ్నించారు.. ఏపీ ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చే వరకూ ఆగారా అంటే అదీ లేదు. మద్యం తయారీ, పంపిణీ, విక్రయాల్లో నెలకొన్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని.. ఈ కారణంగానే సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పేస్తున్నారు లంకా దినకర్. సిద్ధమా అని అడిగేదీ ఆయనే.. సిద్ధంగా లేదని చెప్పేదీ ఆయనే..!
దీంతో.. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ! అలాంటప్పుడు జగన్ అనుమతితో ఆ పార్టీ నేతలకు ఏమి సంబంధం అనేది ఇక్కడ కీలక ప్రశ్నగా ఉంది. ఇక్కడ స్కిల్ స్కాం కేసులో విచారణకు చంద్రబాబు సిద్ధమా అని ఏపీ సీఐడీ అడగలేదు… సాక్ష్యాధారాలు దొరికాయి, నంద్యాల వెళ్లి పట్టుకొచ్చేసింది. కోర్టులో ప్రవేశపెట్టింది.. అక్కడ నుంచి చట్టం తనపని తాను చేసుకుపోతోంది.
అంతే కానీ… చంద్రబాబుకు ధమ్ముందా అని వైసీపీ నేతలు సవాళ్లు గట్రా చేసి.. టీడీపీకి, చంద్రబాబుకూ అంత ధమ్ములేదు, అందుకే వణికిపోతున్నారని… ప్రశ్నా సమాధానం వైసీపీ నేతలు ఇవ్వలేదు కదా. దీంతో… పనితనం అంటే అలా ఉండాలని అంటున్నారు పరిశీలకులు. ఈ తెలివి తేటలతోనే కదా… ఏపీలో బీజేపీకి ఇలాంటి పరిస్థితి కల్పించారని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా… ఏపీ బీజేపీ అనేది జాతీయ స్థాయిలోని బీజేపీకి ఉపశాఖే కదా అనే అనుమానాలు కనిపిస్తుండటం కొసమెరుపు.