తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. ఇంతలోనే, నోట్లాటకు తెరలేచింది. వేలం పాట షురూ అయ్యింది.! ఓట్లను కొనేందుకుగాను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ, తమ అమ్ములపొదిలోని ఆయుధాలన్నిటినీ వినియోగిస్తోంది.
ఓటుకు వెయ్యి రూపాయలతో మొదలైన వేలం పాట, కొన్ని చోట్ల ఆరు వేల నుంచి పది వేల వరకూ పలుకుతోందట.! పది వేలు ఏం ఖర్మ, పన్నెండు.. పదిహేను వేలైనా ఇస్తారు.. ఇవ్వక ఛస్తారా.? అని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాకులిస్తున్నారట.
మరీ, అంత దారుణమా.? ఛాన్సే లేదు.! ఐదు వేలు చాలా చాలా ఎక్కువ.. అన్న వాదన కూడా లేకపోలేదు. ఎవరి గోల వారిది.! అందినకాడికి ఓటర్లు దందుకుంటున్నారు. అప్పులు చేసి మరీ, ఓట్లను కొనుక్కుంటున్నాయి రాజకీయ పార్టీలు.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని క్లాస్ ఏరియాల్లోనూ ఈసారి నోట్ల కట్టల ప్రవాహం కనిపిస్తోంది. ఇక్కడా బేరం వెయ్యి రూపాయలతోనే మొదలవుతోంది. పార్టీల నాయకుల వద్దకు వెళ్ళి, ‘ఓట్లున్నాయ్.. ఎంతిస్తావ్ గంపగుత్తగా..’ అంటూ ఓటర్లే అడిగేస్తోంటే, రాజకీయ నాయకులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడంలో వింతేముంది.?
ఇదిలా వుంటే, ప్రచారంలో అలసిపోయిన నాయకులు, కార్యకర్తలు.. ప్రచారపర్వం ముగియగానే రెస్ట్‌లోకి వెళ్ళిపోయారు. చీకటి పడిన కాస్సేపటికే మళ్ళీ అర్థరాత్రి చాటుమాటు వ్యవహారాలు నడపాలి కదా.. ఆ పనుల్లో బిజీ అయిపోక తప్పడంలేదు.
మూకీ ప్రచారాలూ జరుగుతున్నాయ్ అక్కడక్కడా.! సందట్లో సడేమియా, బెట్టింగుల జోరు కూడా పెరిగింది. ఎవరు గెలుస్తారు.? ఎవరి మెజార్టీ ఎంత.? ఇలా రకరకాల అంశాల చుట్టూ బెట్టింగులు జరుగుతున్నాయ్.