బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయా.?

తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. అధికారం దక్కని పక్షంలో ప్రతిపక్షం హోదా అయినా దక్కుతుందనే ధీమాతో వుంది బీజేపీ.! కాంగ్రెస్ అయినా ఫర్లేదుగానీ, బీజేపీతో కష్టమన్న భావనలో గులాబీ పార్టీ వుందా.? అంటే, ఔనని చెప్పొచ్చేమో.!

కాంగ్రెస్ – బీఆర్ఎస్ కలుస్తున్నాయన్నది బీజేపీ ఆరోపణ. కాదు కాదు బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనన్నది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. మధ్యలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపణ ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది.

గత కొన్నాళ్ళుగా వైఎస్ షర్మిల నోట, కాంగ్రెస్ స్వరం వినిపిస్తోంది. బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని షర్మిల నినదిస్తున్నారు. ‘సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలతో సరిపెడతారేం.? అరెస్టు చేయించి, జైలుకు పంపొచ్చు కదా.?’ అన్నది షర్మిల వాదన.

మొత్తమ్మీద, తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి జరిగిన మార్పులు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తున్నాయి. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.

అయితే, కాంగ్రెస్ పార్టీకి ఓ పెద్ద సమస్య వుంది. అదే, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువవడం. కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్య నేతలే, ముఖ్యమంత్రి అభ్యర్థులయ్యేంత సీన్ వున్నోళ్ళే. సీన్ వున్నా లేకున్నా అలా ప్రచారం చేసుకునేటోళ్ళే.

కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులు అవసరం లేదు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. ఆ సంగతి కేసీయార్‌కి ఇంకా బాగా తెలుసు. రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. ఎన్నికల సమయంలో ఏ ఈక్వేషన్ ఎలా మారిపోతుందో చెప్పలేం.!