కమెడియన్ బ్రహ్మానందంకి రాజకీయాలు అవసరమా.?

ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. బీజేపీ నేత తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి, మంత్రి కె. సుధాకర్‌కి ఓటు వేసి గెలిపించాలంటూ బ్రహ్మానందం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

చిక్కబళ్ళాపుర నియోజకవర్గంలోని పుర, గిడగానహళ్ళి, బొమ్మనహళ్ళి తదితర ప్రాంతాల్లో బ్రహ్మానందం ప్రచారం సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఈ ప్రాంతాలున్నాయి. ఎక్కువగా ఇక్కడ తెలుగువారే వుంటారు. దాంతో, బ్రహ్మానందం తెలుగులోనే ప్రసంగించారు.

కాగా, మంత్రి సుధాకర్‌తో బ్రహ్మానందంకి చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయట. వైద్యుడిగా, మంత్రిగా సుధాకర్ చేసిన సేవలే తాను ఆయన తరఫున ప్రచారం చేయడానికి కారణమని బ్రహ్మానందం అంటున్నారు.

అయితే, కమెడియన్ బ్రహ్మానందంకి రాజకీయాలు అవసరమా.? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ‘బీజేపీ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేయడమేంటి.?’ అంటూ తెలుగునాట బ్రహ్మానందంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

‘సినీ నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.. రాజకీయాల్లోకి వెళ్ళి మీ పేరు చెడగొట్టుకోవద్దు..’ అంటూ కొందరు ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. నిజానికి, రాజకీయాల్లో సినీ గ్లామర్‌ని వాడుకోవడం కొత్తేమీ కాదు. చాలామంది సినీ ప్రముఖులు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమవుతారు.

బ్రహ్మానందం కూడా అంతేనేమో.! ఆయన సినీ గ్లామర్‌ని కొన్ని ఓట్ల కోసం బీజేపీ వాడుకుంటోందంతే.!