సత్తిబాబు దారెటు..!? బొత్స సత్యనారాయణ..

నిన్న మోన్నటి వరకు అనే కాదు..ఏ ముహూర్తాన ఆయన 1999 లో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారో గాని అప్పటి నుంచి మంచిగానో..చెడ్డగానో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఏ విషయంపై అయినా తనకు అవగాహన ఉన్నా లేకపోయినా ప్రెస్ మీట్ ఎట్టేసి నోటికి వచ్చిందల్లా మాటాడేయడమే ఆయన స్టైల్.దబాయింపు.. గదమాయింపు ఆయన నైజం. రాజకీయంగా గడి నప్పడం.. గడి దాటడం..గాడి తప్పించడం..గారడి చెయ్యడం..ఇవన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలు. ఆ విద్యలతోనే సొంత జిల్లాలో రాజకీయ తొలి గురువు పెనుమత్స సాంబశివరాజుతో సహా రాష్ట్ర స్థాయిలో ఎందరో నేతలను తన రాజకీయ ఎదుగుదలకు వాడుకుని.. చాలామందిని తొక్కుకుని మొత్తానికి ఒక స్థాయికి చేరుకున్నారు సత్తిబాబు అనే ఈ బొత్స సత్యనారాయణ. రాస్తూ పోతే ఆయన రాజకీయ ప్రస్థానం నయా పాలీటీషియన్లకు ఒక పెద్ద పాఠమూ.. గుణపాఠమూ అవుతుంది.

మొత్తానికి ఘటనాఘటన సమర్ధుడు అయిన బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితంలో మరోసారి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డారు. ఉన్న పార్టీలో కొనసాగడమా.. పార్టీ మారడమా.. మారాలనుకుంటే ఏ పార్టీ..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇంకా వైసీపీలోనే కొనసాగుతారని అనిపించడం లేదు.జగన్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం సాధిస్తుందని నమ్మే స్థితిలో కొద్ది మంది నాయకులే ఉన్నారు. అలా లేని వారిలో అగ్రగామి సత్తిబాబు.అదీగాక సత్తిబాబు ఖాళీగా కూర్చునే రకం కాదు. ఒకరకంగా చెప్పాలంటే జగన్ సర్కార్ అధికారంలో ఉండి మంత్రిగా ఉన్నా గాని ఆయనకి గడచిన అయిదేళ్లలో అంత ప్రాధాన్యత లేదు. అధికారపక్షంలో ఉన్నప్పుడు విపక్షాన్ని.. ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని ఆడుకోవడం ఆయన బాగా ఇష్టపడే కార్యక్రమం.అలాంటి సత్తిబాబు ఇప్పుడు ఖాళీ అయిపోయారు.

ఖాళీ అంటే మరీ ఖాళీగా ఉండిపోవడం లేదు. అది ఆయన డిక్షనరీలోనే లేదు. ఏం చేస్తున్నారు..అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా అనే రకం కాదు.ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మంట పెట్టడం..రాజేయడం.. వ్యాప్తి చెయ్యడం..ఇలా ఏదో ఒకటి.

ఇప్పుడైతే మాత్రం “తదుపరి ఏంటి” అని తన భవిష్యత్తుపై తానే ఆందోళనలో..తదనుగుణంగా ఆలోచనలో ఉన్నారు.ఆయనకైతే అన్ని పార్టీల్లోనూ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. అవి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో సరేసరి. ఢిల్లీ వరకు సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.. కొనసాగుతున్నాయి కూడా.. సొంత జిల్లా విజయనగరంలోనైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది.

అన్ని పార్టీల్లోనూ తెలిసిన వారున్నా ఇప్పుడు అడుగులు ఎటు వెయ్యాలన్నదే సత్తిబాబు ముందున్న కీలక ప్రశ్న. తెలుగుదేశంలో చేరాలంటే ఎప్పుడో ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని అనుకుని ముహూర్తం కూడా పెట్టేసుకుని..అధినేత చంద్రబాబు నాయున్నే వెయిటింగులో పెట్టి దెబ్బేసిన బ్యాక్ గ్రౌండ్ ఉంది బొత్స వారికి. అయినా ఇప్పుడు సత్తిబాబు గనక తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటే ముందుగా అశోక్ గజపతిరాజు అనుమతి ఉండాలి..ఆయన ఔనననూ వచ్చు.. కాదననూ వచ్చు..వచ్చినా బేషరతు అనే నియమం తప్పదు.

ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు ఇప్పుడైతే అశోక్ నేతృత్వమూ..ఆమోదమే గాక ఆయన కూతురు అదితి క్లియరెన్స్ కూడా ఉండాలి. అక్కడితో అయిపోయిందా.. తన కంటే వయసులో..అనుభవంలో చిన్న వాళ్లైన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్.. గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వారి కింద పని చెయ్యడం అంటే.. ఇంత బ్రతుకూ బ్రతికి… చందమే..! అంతేనా..కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా తన తమ్ముడు అప్పలనర్సయ్య పై గెలిచిన వ్యక్తి..

ఆగండాగండి.. ఈ బాధలు అక్కడితో అయిపోవు.అప్పుడు చీపురుపల్లిలో తిరగాలంటే తనకి స్వయంగా ఓటమి రుచి చూపించిన కళా వెంకట్రావు వెనక నడవాలి.ఇలాంటి ఎన్నో బాధలు తప్పవు.ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో..నిన్నమొన్నటి వరకు వైసీపీలో చక్రం తిప్పి.. ప్రతి వ్యవహారాన్ని తన కనుసన్నల్లో నడిపించి.. తను ఎవరంటే వారికే టికెట్ అన్న లెవెల్లో కథ.. మాటలు.. స్క్రీన్ ప్లే..సంగీతం..దర్శకత్వం నెరపిన బొత్స.. తెలుగుదేశంలో చేరి సైడ్ యాక్టర్ గా మారిపోయి.. నలుగురితో పాటు సత్యనారాయణ..అన్నట్టు ఉండడం అంటే రాస్తున్న నాకే కొంచెం కష్టంగా ఉంది.

ఇక రెండో ఆప్షన్.. జనసేన.. జనసేన పార్టీకి విజయనగరం జిల్లాలో..ఆమాటకొస్తే ఉత్తరాంధ్రలో బలమైన నాయకత్వం అవసరం ఎంతో ఉంది.సత్తిబాబు అక్కడ సరిగ్గా ఫిట్ అవుతారు.ఆయనకి చిరంజీవి..పవన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.మామూలుగా అయితే ఆయనకు జనసేనలో ప్రవేశానికి పెద్దగా అవరోధాలు ఉండకపోవచ్చు.అయితే సత్తిబాబు వంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయున్ని సంప్రదించే సంప్రదాయాన్ని పాటిస్తారనే భావించాల్సి ఉంటుంది. అప్పుడు చుట్టూ తిరిగి బంతి మళ్ళీ బాబు కోర్టుకే చేరుతుంది.

ఇక బిజెపి విషయం.. ఆ పార్టీకి జిల్లా..ఉత్తరాంధ్ర స్థాయిలోనే గాక రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకుల అవసరం ఉంది.అయితే వచ్చిన చిక్కల్లా..తెలుగుదేశం.. జనసేన..బిజెపి కలిసే ఉండడం. సత్తిబాబనే కాదు ఆ తరహా నాయకులు ఎవరిని బిజెపి.. జనసేన వంటి పార్టీల్లోకి తీసుకున్నా కూటమి మిత్రధర్మానికి ఎంతో కొంత మేర అవరోధం ఏర్పడే ప్రమాదం ఉండకపోదు.కనుక ఎంట్రీ అంత సులభం కాకపోవచ్చు.

ఇప్పుడు మిగిలింది మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ..సత్తిబాబు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే అక్కడ షర్మిల మాత్రమే ప్రతిబంధకం కావచ్చు … కాంగ్రెస్ పార్టీ జాతీయ.. రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ సత్తిబాబు ప్రవేశం పట్ల అభ్యంతరం ఉండదేమో. ఏదిఏమైనా సత్తిబాబుకి కాంగ్రెస్ పార్టీ ప్రవేశమే సర్వవిధాలా శ్రేయోదాయకం.!