బాధ్యత లేని టీ.సర్కార్.. సబిత స్పందిస్తారా?

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై ప్రభుత్వం తరుపున ఏ ఒక్కరూ కనీస నైతిక బాధ్యత వహించకపోవడంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలా ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో సతమతమవుతున్న తెలంగాణ సర్కార్ కు తాజాగా పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

అవును… టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహార దుమారం ఇప్పటికీ ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో హల్ చల్ చేసింది. పరీక్ష జరుగుతుండగానే వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ పాఠశాలలో పదోతరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమయ్యింది. దీంతో మైకుల ముందుకు వచ్చారు ప్రతిపక్ష నేతలు… ప్రభుత్వ చేతకాని తనానికి ఇవన్నీ ఉదాహరణలంటూ ఫైరయ్యారు. ఇది లీకుల ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… పిల్లల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో అన్నీ లీకులేనని.. ఈ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో… ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి దగ్గరకు వచ్చిందని.. కనీస నైతిక బాధ్యత వహించడం కనీస ధర్మమని కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఎవరో అన్నారని కాదు.. మరెవరో డిమాండ్ చేశారనీ కాదు కానీ… రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా.. ఇంత దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నా… రాష్ట్ర విద్యాశాఖా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి.. కనీసం మీడియా ముందుకు రానటువంటి పరిస్థితిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అవును… టీఎస్పీఎస్సీలో అంత రచ్చ జరుగుతుంది.. ఆత్మహత్యలూ వెలుగులోకి వచ్చాయి.. విద్యార్థులు – నిరుద్యోగులు – వారి తల్లితండ్రులూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కనీస ధర్మంగా మీడియా ముందుకు రాలేకపోయారు సబిత.

దీంతో… సబిత వ్యవహారాన్ని – కేసీఆర్ పద్దతిని తలచుకున్న తెలంగాణ ప్రజానికం… వీరి పద్దతిని తేలు కుట్టిన దొంగల పద్దతి అనుకోవాలా.. లేక, విద్యార్థులపై తమకున్న నిర్లక్ష్యానికి, వారి జీవితాలపై ప్రభుత్వానికున్న అలసత్వానికీ ఇది నిరదర్శనమని సరిపెట్టుకోవాలా అంటూ ప్రశ్నలు సందిస్తున్నారు నెటిజన్లు! ఫలితంగా వారు కూడా ప్రభుత్వం నుంచి నైతిక బాధ్యతను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు! మరి ఈ వ్యవహారంపై అయినా ప్రభుత్వ పెద్దలు, సంబందిత శాఖా మంత్రులు, ముఖ్యమంత్రి స్పందిస్తారా? లేక, మౌనాన్నే తమ బాషగా చేసుకుంటారా అన్నది వేచి చూడాలి!