రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు వుండరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ లెక్కన వైసీపీతో బీజేపీ జత కట్టాల్సిన పరిస్థితి వస్తే.! ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు.
బీజేపీ నేత సునీల్ దేవధర్ (ఏపీ బీజేపీ వ్యవహారాల్ని చూస్తుంటాడీయన) తాజాగా, గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని మీద తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. దానికి కొడాలి నాని కౌంటర్ ఎటాక్ కూడా గట్టిగానే ఇచ్చారు.
ఇంకోపక్క, వైసీపీ మద్దతుదారుడైన బీజేపీ నేతగా పేరొందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎందుకో ఈ మధ్య ప్లేటు ఫిరాయించారు. అయినాగానీ, ఎక్కడో బీజేపీ – వైసీపీ మధ్య లంకె కుదిరినట్లుగా గత కొద్ది రోజుల నుంచి చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో అర్థమవుతోంది.
పొత్తుల విషయమై పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన, బీజేపీకి అస్సలు నచ్చలేదు. దాంతో, బీజేపీ తన దారి తాను చూసుకోవాలనుకుంటోంది. పొత్తుకి సహకరించినా టీడీపీ – జనసేన ద్వారా తమకు వచ్చే సీట్లు తక్కువని బీజేపీకి కూడా తెలుసు.
నాలుగైదు సీట్లకు మించి అడగలేదు బీజేపీ. టీడీపీ – జనసేన.. ఈ రెండూ కలిసి అంతకన్నా మించి సీట్లు బీజేపీకి ఇవ్వవు. అదే వైసీపీతో జత కడితే.? ఓ పది సీట్ల వరకూ అడగొచ్చని బీజేపీలో కొందరు కీలక నేతలు అధినాయకత్వానికి సమాచారం పంపించారట. ఎంపీ సీట్లు ఎక్కువగా ఇస్తే, అసెంబ్లీ సీట్ల విషయంలో పెద్దగా పట్టింపుల్లేవట బీజేపీకి.