బిజెపి- జన సేన పార్టీలకు అగ్ని పరీక్షే?

Janasena and BJP Alliance

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఈ ప్రతిపాదనను రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర బిజెపి కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక విధంగా అందరి కన్నా ముందు వుంది. పైగా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించే జనసేన నేత పవన్ కళ్యాణ్ తో బిజెపి పొత్తు పెట్టుకొనింది. టిడిపి కన్నా ఒక ఆకు ఎక్కువగా అమరావతి అంశంలోగాని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎపిసోడ్ లో గాని రాష్ట్ర బిజెపి జనసేన నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఫలితంగా ఒక దశలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయాడనే నింద ఎదుర్కొన్నారు. ఒక దశలో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివియల్ నరసింహారావు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని వైకాపాకు అనుకూలంగా ప్రకటన చేసినా ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా వైకాపా ప్రభుత్వం తీసుకు వచ్చిన సిఆర్డీఏ చట్టం రద్దు వికేంద్రీకరణ బిల్లుల భవిష్యత్తు ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ కోర్టుకు చేరింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించితే కేంద్రం స్థాయిలో వైకాపా బిజెపి భాయ్ భాయ్ గా వున్నాయని రాష్ట్ర స్థాయిలో ఉత్తుత్తి పోరాటం రాష్ట్ర పార్టీ చేస్తున్నదనే నింద బిజెపితో పాటు జనసేన భరించక తప్పదు.

ఈ బిల్లులను శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపి వుందని పైగా కోర్టులో కేసు వుందని దీన్ని ఆమోదించ వద్దని టిడిపి నేత ఎనమల రామ కృష్ణడు గవర్నర్ కు లేఖ రాశారు. అదే సమయంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాశారు. అమరావతి రాజధానికి ప్రధాన మంత్రి పునాది రాయి వేసినందున రాజధానిని కాపాడుకోనే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుందనే సెంట్ మెంట్ ను టిడిపి బలంగా తీసుకెళుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఈ రెండు బిల్లులను ఆమోదించితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రొట్టె విరిగి నేతిలో పడినట్లే. ఇక రాష్ట్ర పతి ఆమోదం లాంఛన ప్రాయమే. వెను వెంటనే పరి పాలన రాజధానిని విశాఖ తరలించేస్తారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ఒక వేళ బిల్లులను రాష్ట్ర పతి పరిశీలనకు పంపితే వైకాపా ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడుతుంది. ఆలా కాకుండా రాష్ట్ర గవర్నర్ బిల్లులకు ఆమోద ముద్ర వేస్తే రాష్ట్రంలో అన్ని ప్రతి పక్షాల కన్నా బిజెపి జనసేన నేతలు ఆత్మ రక్షణలో పడక తప్పదు. కీలక మైన సమయాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే గవర్నర్ అటు కేంద్ర హోం శాఖతో గాని రాష్ట్ర పతితో గాని సంప్రతించడం రివాజు. గవర్నర్ ఆ సంప్రదాయం పాటించి వారి అనుమతి తీసుకొని బిల్లులను ఆమోదించితే రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు తల ఎత్తుకు తిరగ లేవు. రాజధాని అంశంలో మాట తీసుకొనే తను బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించి వున్నారు. అప్పుడు అదంతా గాలికి పోతుంది.

రాష్ట్రంలో రావణ కాష్ఠంగా తయారైన అమరావతి రాజధాని అంశంలో గవర్నర్ కేందంతో సంప్రతించిగాని సంప్రదింపులు చేయకుండా గాని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఈ బిల్లులను ఆమోదించితే అమరావతి రాజధానిగా వుండాలని భావించే ఉద్యమం ముందు బిజెపి జనసేన ముద్దాయిలుగా నిలబడి వలసి వుంటుంది. విశాఖ పరిపాలన రాజధాని ప్రతి పాదనను కూడా విశాఖ ప్రాంత బిజెపి నేతలు వ్యతిరేకించి అమరావతి రాజధాని ప్రతి పాదనను బల పర్చి వున్నారు.

ఇదిలా వుండగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎపిసోడ్ కూడా ఇప్పుడు రాష్ట్ర బిజెపి జనసేన నేతలకు ప్రాణ సంకటమైంది. టిడిపి కన్నా ఎక్కువగా ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కొన సాగాలని రాష్ట్ర బిజెపి నేతలు కృషి చేస్తున్నారు. రమేష్ కుమార్ కు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు తీర్పులు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించేందుకు ఇష్ట పడటం లేదు. తుదకు కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యానాలు అటుంచగా రాష్ట్ర గవర్నర్ ను కలవమని హైకోర్టు రమేష్ కుమార్ కు సూచించింది. ఇది రాష్ట్ర గవర్నర్ పరిధిలో వుందని చెప్పింది. రేపో మాపో రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. ఇప్పుడు కూడా గవర్నర్ నిర్ణయం కీలకం కానున్నది. హైకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ బాధ్యతలు చేపట్టేందుకు ఆదేశాలు ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడతారు. విధిగా ఆదేశాలు అమలు జరుగుతాయి. ఒక వేళ గవర్నర్ సమస్య నానబెట్టినా తిరస్కరించినా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర బిజెపి జనసేన నేతలు జవాబు చెప్పుకోవలసి వుంటుంది. నేను కొట్టినట్లు నటిస్తాను నువ్వు ఏడ్చినట్లు నటించు అనే ధోరణిలో కేంద్ర రాష్ట్ర బిజెపి నాయకత్వాలు వ్యవరిస్తున్నాయని రాష్ట్ర ప్రజలు భావించే అవకాశం వుంది.

ఇదిలా వుండగా రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఎదురు దెబ్బలు తింటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వుంటుంది. తిరిగి బిజెపితో పొత్తు గురించి పునరాలోచన చేస్తారేమో. ఇరువురు కూడా ఇక మీదట ఈ రెండు అంశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీసే హక్కు కోల్పోతారు. ఇది వరలోనే ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగించే సమయంలో గవర్నర్ వెను వెంటనే సంతకం చేయడంపై రాష్ట్ర బిజెపి నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఏకంగా రాష్ట్ర గవర్నర్ ఆమోదించినా రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించేందుకు ఆదేశాలు ఇవ్వకున్నా రాష్ట్రంలో బిజెపి జనసేన యేతర పార్టీలు పొందే నష్టం కన్నా ఈ రెండు పార్టీలు ప్రజల ముందు దోషిగా నిలబడ వలసి వుంటుంది. కేంద్రంలో తమ ప్రభుత్వం వుండీ న్యాయబద్ధ మైన అంశాలు సాధించడంతో విఫలమైనాయనే అపప్రధ మూట గట్టుకోవలసి వుంటుంది. ఒక విధంగా ఈ రెండు పార్టీలకు అగ్ని పరీక్షే.