లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్… ఈడీ అధికారులపై సీబీఐ కేసు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ చేస్తున్న ఈడీ అధికారులు లంచం తీసుకున్నట్లు సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది. లిక్కర్ కేసు విచారణలో నిందితుడు అమన్‌ సింగ్ ధల్ నుంచి రూ. 5 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ అభియోగాలు మోపింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే… ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్న పలువురు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టి గేషన్ (సీబీఐ) కేసులు నమోదు చేసింది. వీరిలో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రితో పాటు అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ నితేష్‌ కోహర్‌, ఎయిరిండియా ఉద్యోగి దీపక్‌ సంగ్వాన్‌, క్లారిడ్జెస్‌ హోటల్స్‌ సీఈవో విక్రమాదిత్య ఉన్నారు!

లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు అమన్‌ సింగ్ ధల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ వీరిపై అభియోగాలు మోపింది. మనీలాండరింగ్ వ్యాపారి అమన్‌ దీప్ నుంచి ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. త్వరలోనే వారందర్నీ విచారణకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో లిక్కర్ కేసులో ఇది కొత్తకోణమే అని అంటున్నారు పరిశీలకులు.

లిక్కర్ పాలసీ విచారణ సందర్భంగా.. కేసులో నిందితుడైన అమన్‌ ధల్, అతని తండ్రి బీరేందర్ పాల్ సింగ్ రూ. 5 కోట్ల లంచం ఇచ్చినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం బయటపడింది. నిందితుల జాబితా నుంచి అమన్‌ దీప్‌ పేరును తొలగించడానికి చార్టడ్ అకౌంటెంట్ ప్రవీణ్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో… డిసెంబరు 2022 నుంచి జనవరి 2023 మధ్య కాలంలో తాము ప్రవీణ్‌ అనే ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ కు రూ.5 కోట్లు ఇచ్చినట్లు అమన్‌ దీప్‌, ఆయన తండ్రి బీరేందర్‌ పాల్‌ ఈడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌ తనకున్న పరిచయాలతో ఈడీలోని అధికారులతో మాట్లాడి.. దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించేలా మాట్లాడతానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఈడీ ఆగస్టు 7న సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. అమన్‌ దీప్‌ నుంచి ప్రవీణ్‌, దీపక్‌ సంగ్వాన్‌ లు రూ.5 కోట్లు తీసుకున్నట్లు తెలిపింది. వీరంతా వసంత్ విహార్‌ లోని ఐటీసీ హోటల్ వెనుక పార్కింగ్ లో కలుసుకున్నట్లు తెలియవచ్చింది. అక్కడే సంగ్వాన్, ఖత్రీలకు అమన్‌ దీప్ నుంచి తీసుకున్న రూ. 50 లక్షలు అడ్వాన్స్‌ గా ఇచ్చినట్లు తేలిందని సమాచారం.

దీంతో ఈడీ ఫిర్యాదు మేరకు ఖత్రి, కోహర్‌, సంగ్వాన్‌, ప్రవీణ్‌, విక్రమాదిత్య సింగ్‌, అమన్‌ దీప్‌ సింగ్‌, బీరేందర్‌ పాల్‌ సింగ్‌ పై సీబీఐ కేసు నమోదు చేసింది.