పశ్చిమబెంగాల్‌లో రాజకీయం వేడెక్కింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ పీఠం దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే, అధికార టీఎంసీ.. మళ్ళీ తమదే అధికారం అంటోంది. ఒకే ఒక్క మహిళ.. దేశాన్ని పాలిస్తోన్న భారతీయ జనతా పార్టీని సవాల్ చేస్తోన్న వైనం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న విషయం విదితమే. ఔను, ఆమె ఉక్కు మహిళ.. ఆమె ఎవరో కాదు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాస్త ప్రభుత్వ వ్యతిరేకత అనేది సర్వసాధారణమే అయినా, మమతా బెనర్జీని కాదని.. ఇంకొకరికి బెంగాల్ పగ్గాలు అప్పగించేందుకు అక్కడి ప్రజానీకం సిద్ధంగా లేరని చాలా సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి.
అయితే, బీజేపీ మాత్రం.. పక్కా వ్యూహంతో బెంగాల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ‘ఈసారి అధికారం మాదే.. బెంగాల్‌లో చరిత్ర సృష్టించబోతున్నాం..’ అంటూ ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నినదిస్తోన్న సంగతి తెల్సిందే. కాగా, ఇటీవల బెంగాల్‌లో జేపీ నడ్డా పర్యటన సందర్భంగా తలెత్తిన పరిస్థితులు, ఈ క్రమంలో ఐపీఎస్ అధికారులపై కేంద్రం సీరియస్ అవడం.. దాంతో మమతా బెనర్జీ పట్ల సానుభూతి పెరడం.. చకచకా జరిగిపోయాయి. దేశంలోని పలు రాజకీయ పార్టీలు (బీజేపీ యేతర పార్టీలు) మమతా బెనర్జీకి మద్దతిస్తున్నాయి.
ఆమె త్వరలో ఓ భారీ బహిరంగ సభ లేదా ర్యాలీ నిర్వహించాలనే సన్నాహాల్లో వున్నారు.. అదీ ముఖ్యమంత్రి హోదాలో, కేంద్ర చర్యల్ని నిరసిస్తూ. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబునీ సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే టీఎంసీ తరఫున ఓ ముఖ్య నేత టీడీపీ అధినేతతో చర్చించేందుకు ప్రయత్నించగా, చంద్రబాబు మొహం చాటేశారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మమతా బెనర్జీతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నినదించారు. ఆ సమయంలో చంద్రబాబుకి బాసటగా నిలిచారు మమతా బెనర్జీ. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. చంద్రబాబు, పైకి బీజేపీని పలు సందర్భాల్లో విమర్శిస్తున్నా, ఆ పార్టీతో ఎలాగైనా తిరిగి స్నేహం చేయాలనే తపనతో వున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, మమతా బెనర్జీని కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదట.