దొంగలను దింపాలి, బిసిలు రాజ్యమేలాలి- జాజుల శ్రీనివాస్

దేశంలో ఉన్న బిసి కులస్తులంతా చైతన్యవంతం కావాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో అగ్రకులాల నాయకులకు ఓట్లు వేయకుండా బిసి అభ్యర్ధులకు మాత్రమే ఓట్లు వేసిన రోజున బీసీల బతుకులు మారుతాయని అన్నారు. అందుకే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, పాలమూరు నుంచి పట్నం వరకు బిసీలకే రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగష్టు 7 నుంచి సెప్టెంబర్ 11 వరకు బస్సు యాత్ర చేస్తున్నామన్నారు. కొన్నేండ్ల నుంచి అగ్రకులాల నాయకులు బిసీల చేత చేయించుకుంటున్న రాజకీయ గులాంగిరిని అంతమొందించేందుకే ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తమ ఆధిపత్య పోరుతో ఎంపీ, ఎమ్మెల్యేలుగా చెలామనీ అవుతున్న దొరలకు రానున్న 2019 ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. ప్రస్తుతం బిసిల బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుంది.

ప్రాణాలను త్యాగం చేసైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలను బిసి అభ్యర్థులనే గెలిపించుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. మళ్లీ దొరలు పదవులు దక్కించుకొని విద్యా రాజకీయంగా అణచివేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఫేడరేషన్ పేరు మీద రుణాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు ఉన్నత పదవులు దక్కకుండా కేవలం 5శాతం ఉన్న అగ్రకులాల వారు అందల మెక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరు ఆపమని బీసీ సంఘం రాష్ట్ర స్థాయి నేత, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేష్ గౌడ్, బీసి విద్యార్ధి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్, బిసి సంఘం నేత ఉయ్యాల ప్రశాంత్ గౌడ్, తడక చంద్రకీరన్ అన్నారు.