గతంలో మోడీ తొలిసారి ప్రధాని అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టిన సమయంలో చేసిన భారీ హామీల్లో.. నల్లధనం ఒకటి. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తీసుకొస్తామని.. అందరి అకౌంట్లలోనూ లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పుకొచ్చారు. అనంతరం రెండు దఫాలు అధికారంలోకి వచ్చినా… ఆ అంశంపై నోరు మెదపడంలేదు. సరికదా… అది మరింత పెరిగిందని విశ్లేషకులు వివరాలు చెబుతున్నారు. దీంతో… నల్లధనంపై మోడీ తెల్లమొహం వేశారనే విమర్శలు మొదలైపోయాయి.
ఆ సంగతులు అలా ఉంటే… తర్వాతి కాలంలో మోడీ ఎత్తుకున్న అంశం అభివృద్ధి, మేక్ ఇన్ ఇండియా. వీటి సక్సెస్ సంగతి తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే… తెలుగు రాష్ట్రాల విషయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసిన పరిస్థితి. ఏపీలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాల అనంతరం పోలవరానికి పూర్తి నిధులతో పాటు విశాఖ రైల్వే జోన్, రాష్ట్ర విభజన సమయంలో చేసిన విభజన హామీలు అన్నీ లైట్ తీసుకున్న పరిస్థితి. ఆల్ మొస్ట్ ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు సైతం నోరు మెదపలేకున్నారు.
ఇక తెలంగాణ విషయంలో కూడా అధికారంలోకి వస్తే ఏమి చేస్తామన్న విషయంపై బీజేపీ నేతలు చేసిన హామీలు… వారి మానసిక పరిస్థితికి అద్ధం పడుతున్నాయనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి. కారణం… తాజాగా తెలంగాణలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన అమిత్ షా… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రకటించారు. అది ఆయన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భారీ హామీ! ఇది తెలంగాణ అభివృధికి ఎలా తోడవుతుందో ఆయనకే తెలియాలి.
ఈ క్రమంలో తాజాగా “ది కేరళ స్టోరీ” సినిమా చూసిన టి.బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ రాజకీయం అంతా మతాల చుట్టునే తిరుగుతుందని చెప్పకనే చెప్పారు. అవును… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే… “ది కేరళ స్టోరీ” వంటి సినిమాలు వారానికొకటి తీస్తామంటూ తెలంగాణ ప్రజలకు భారీ వరాన్ని ప్రకటించారు బండి సంజయ్. ఇదే క్రమంలో ఆ సినిమాకు అన్ని రకాట టాక్సులూ ఎత్తేయాలని టి.సర్కార్ కు ఒక సూచన కూడా చేశారు. దీంతో… తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఒక మతం వారికి రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఒకరు చెబుతుంటే… వరుసపెట్టి సినిమాలు తీస్తామని… ఫలితంగా సమాజంలో ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి తగిన ప్రణాళికలు రచిస్తామని చెప్పుకొస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి.. ఇంత పెద్ద అభివృద్ధి ప్రణాళికలు చేసుకుంటున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు ఏ మేరకు అండగా ఉంటారనేది వేచి చూడాలి.