తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. అరటి పండు తొక్కతో ఎన్ని లాభాలో తెలుసా..?

అరటి పండు అంటే అందరికీ ఇష్టమే.. అందులో ఉండే విటమిన్ B6, విటమిన్ C, పోటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి శక్తి ఇస్తాయి, రోజువారీ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి. అందుకే చాలా మంది రోజు కనీసం ఒక అరటి పండు తినాలని వైద్యులు సైతం సిఫార్సు చేస్తుంటారు. అయితే, చాలా మంది అరటి తిన్న వెంటనే దాని తొక్కను చెత్తబుట్టలో పడేస్తారు. కానీ అదే తొక్క చర్మానికి, పెదవులకు, ఇల్లు మొక్కలకు ఉపయోగపడుతుందని తెలుసా.. ఈ కథనంలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. అరటి పండు తొక్కలో ఉన్న విటమిన్ B6, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో అవసరం. రాత్రి పడుకునే ముందు ఆ తొక్కను ముఖంపై సున్నితంగా రాసుకుని వదిలేస్తే ఎండిన చర్మానికి తేమ పునరుద్ధరిస్తుంది. క్రమంగా చర్మం తేలికగా మెరుస్తుంది. ఇలాగే, పెదవులు ఎప్పటికప్పుడు పగిలే సమస్య ఉన్నవారు కూడా రాత్రి అరటి తొక్కను పెదవులపై రాసుకుంటే చాలు. క్రమంగా పగుళ్లు తగ్గి, పెదవులు మృదువుగా మారతాయి.

కేవలం చర్మం, పెదవులు మాత్రమే కాదు… అరటి పండు తొక్కతో మీ ఇంట్లోని మొక్కల ఆకులు కూడా కొత్త కాంతిని పొందుతాయి. బాల్కనీలోని గ్రీన్ ప్లాంట్స్ పై వేసి ఉండే దుమ్ము, మురికిని తొక్కతో తుడిచి వేస్తే ఆకులు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మారుతాయి. ఇది ఎక్కువ నీటితో శుభ్రం చేసినప్పుడు వచ్చే డామేజ్‌ను కూడా తగ్గిస్తుంది. అందుకే.. ఇకపై అరటి పండు తిన్న తర్వాత తొక్కను విసరేయకుండా.. చర్మం, పెదవులు, ఆకులు అందంగా ఉంచడానికి ఉపయోగించండి. కాస్త ప్రయత్నిస్తే, సహజమైన ఆరోగ్య సంరక్షణలో భాగం చేసుకోవచ్చు.