జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన వారాహి విజయ యాత్రకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతుని ప్రకటించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
మెగా – నందమూరి ‘సినీ, రాజకీయ వైరానికి’ ముగింపు పలికేలా బాలయ్య – పవన్ కళ్యాణ్ దోస్తీ.. కొన్నాళ్ళ క్రితమే ప్రారంభమైనా, సోషల్ మీడియా వేదికగా ఇంకా ఆ వైరం అభిమానుల మధ్య అలాగే.. అత్యంత జుగుప్సాకరంగానే కొనసాగుతూనే వుంది. అయితే, ఇకపై అలాంటి వైరానికి అవకాశమే వుండదని టీడీపీ శ్రేణులు కొత్త పల్లవిని అందుకున్నాయిప్పుడు.
అవసరం టీడీపీది.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టవడం ఆ పార్టీకి చాలా చాలా పెద్ద దెబ్బ. అదే సమయంలో, టీడీపీకి మద్దతుగా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అక్కడి నుంచే అసలు కథ మొదలయ్యింది.
కాగా, కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మలి విడత వారాహి విజయ యాత్రను ప్రారంభించనున్న దరిమిలా, ఆ యాత్రలో జనసేన శ్రేణులతో కలిసి పాల్గొనేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా, నందమూరి బాలకృష్ణ అభిమానులు మరింత ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొననుండడం గమనార్హం.
చంద్రబాబు జైల్లో, నారా లోకేష్ ఢిల్లీలో వుండడంతో.. టీడీపీని నడిపించే బాధ్యతని నందమూరి బాలకృష్ణ తన భుజాన వేసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో నేడు సమావేశమైన నందమూరి బాలకృష్ణ, జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ శ్రేణులు మద్దతు పలికేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.