వెన్నుపోటు.! ఇప్పుడర్థమయ్యిందా పవన్ కళ్యాణ్.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి టీడీపీ నుంచి వెన్నుపోటే ఎదురయ్యింది. తెలంగాణలో జనసేన పార్టీ ఎనిమిది చోట్ల పోటీ చేస్తే, ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు బీజేపీ అస్సలు సహకరించలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ – జనసేన కలిసి పని చేస్తున్నాయి. తెలంగాణ ఈక్వేషన్ వేరే. బీజేపీ – జనసేన పొత్తు పెట్టుకున్నాయి. రాజకీయం అంటేనే ఇంత.! జనసేనకు తెలంగాణలో టీడీపీ సహకరించి వుంటే, ఆ ఇంపాక్ట్ ఏపీ రాజకీయాలపైనా వుండేది.

పవన్ కళ్యాణ్ కంటే, రేవంత్ రెడ్డి మీద చంద్రబాబుకి అమితమైన ప్రేమ.! అందుకే, కాంగ్రెస్ పార్టీకి గంప గుత్తగా ఓట్లెయ్యాలని తెరవెనుక చంద్రబాబు తెలంగాణ టీడీపీ శ్రేణుల్ని ఆదేశించారు. టీడీపీ క్యాడర్ మొత్తం, కాంగ్రెస్ పార్టీ వెంట తిరిగాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.

కూకట్‌పల్లిలో మాత్రం, కొందరు టీడీపీ కార్యకర్తలు జనసేన వెంట కనిపించారు. ‘అమ్ముడుపోయిన టీడీపీ కార్యకర్తలు, కాంగ్రెస్ వెంట వెళ్ళి వుండొచ్చు..’ అని సాక్షాత్తూ టీడీపీ కార్యకర్తలే, కూకట్‌పల్లిలో వ్యాఖ్యానించడం చూశాం.

కానీ, ఒక్కరంటే ఒక్క టీడీపీ కార్యకర్త కూడా, కూకట్‌పల్లిలో జనసేనకు ఓటేయలేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన శ్రేణులు ఈ విషయమై చాలా చాలా గుస్సా అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలు ఓ శాంపిల్ కింద తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం.. అని జనసేన తెలంగాణ క్యాడర్, తమ అధినాయకత్వానికి సూచిస్తోంది.

ఏపీ జనసేన క్యాడర్ కూడా ఇదే విషయాన్ని తమ అధినాయకత్వానికి కుండబద్దలుగొట్టి మరీ చెబుతోంది. ఇంతకీ, జనసేనాని మనసులో ఏముంది.? సర్లే, పొడిచింది వెన్నుపోటే కదా.? అని సరిపెట్టుకుంటారా.?