ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడంలేదు.. దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే వుంది. ఒకటి, రెండు ఘటనలు జరిగితే.. అది వేరే చర్చ. కానీ, ఒకదాని తర్వాత ఒకటి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వెలుగు చూస్తున్న విగ్రహాల ధ్వంసం ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్మవుతున్నాయి. ‘విగ్రహాల ధ్వంసంపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి ఇటీవల వ్యాఖ్యానించారు.
అయితే, అదొక్కటే సరిపోదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏ చిన్న ఘటన జరిగినా, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విగ్రహాల ధ్వంసం నిజానికి, చాలా సీరియస్ అంశం. ఓ మతంపై పనిగట్టుకుని జరుగుతున్న ఈ దాడులపై ఉక్కుపాదం మోపాల్సిందే. అయితే, ఇంతవరకు ఏ ఘటనలోనూ నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి లేదా, ప్రభుత్వంలో వున్నవారికి వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తే చాలు.. పోలీసులు ఆఘమేఘాల మీద దూసుకెళుతున్నారు నిందితుల్ని అరెస్ట్ చేయడానికి. మరి, విగ్రహాల ధ్వంసం విషయమై పోలీసులు ఎందుకు అంత యాక్టివ్‌గా వుండడంలేదన్న విమర్శలు తెరపైకొస్తున్నాయి. అంతర్వేది రధం దగ్ధం అనేది, రాష్ట్రంలో హిందూ సమాజంపై జరిగిన అతి పెద్ద దాడిగా హిందూ మత సంస్థలు అప్పట్లో అభివర్ణించాయి. అది నిజం కూడా. ఆ తర్వాత కూడా హిందూ దేవాలయాలపై దాడులు ఆగలేదు. బెజవాడ దుర్గమ్మకి చెందిన రధంపై వెండి సింహాలు మాయమైతే, ఇప్పటిదాకా నిందితుల అరెస్ట్ జరగలేదు. అసలు నిందితులెవరన్నదీ ఇప్పటికీ తేలలేదు. దీంతో, సంక్షేమ పథకాల పరంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నా, ‘పాలనా వైఫల్యం’ అనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
మంత్రులు నోరు జారి మాట్లాడుతుండడం, కీలకమైన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోవడమో, ఎదురుదాడి చేయడమో చేస్తుండడం.. ఇవన్నీ రాజకీయంగా వైసీపీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులే. ఈ వైఫల్యం చాలదన్నట్టు, దేవుళ్ళ మీద సత్య ప్రమాణాలంటూ నడుస్తున్న హంగామా వైసీపీకి కొత్త తలనొప్పిగా మారింది. ‘మేమెందుకు ఈ దాడుల్ని ప్రోత్సహిస్తాం..’ అంటూ విగ్రహాల ధ్వంసంపై వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్లోనూ నిజముంది. అయితే, దాడుల్ని ఆపలేకపోవడం అనేది ఖచ్చితంగా పాలనా వైఫల్యమే. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేస్తే సరిపోదు.. ప్రజలకు జవాబుదారీగా వుండాలి. హిందువుల మనోభావాలు దెబ్బతింటోంటే, ప్రభుత్వం ఏం చేస్తోంది.? అన్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి.