దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం మరోసారి సత్తా చాటింది టీమిండియా. ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన భారత్.. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, పాక్ బ్యాటర్లు రాణించేందుకు యత్నించినా.. భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారిని 171 పరుగులకే ఆపేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత ఓపెనర్లు మైదానాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తుపానుగా విరుచుకుపడగా, శుభ్‌మన్ గిల్ ఆరంభాన్ని మరింత బలపరిచాడు. దీంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభం అద్భుతంగా దొరికింది. ఇన్నింగ్స్ తొలి బంతినే షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో సిక్సర్‌గా మలిచిన అభిషేక్ శర్మ ఆరంభం నుంచే దూకుడును చూపించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ స్కోరు 69/0గా ఉండగా.. ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తొలి వికెట్‌కు గిల్, అభిషేక్ జోడీ 105 పరుగులు జతచేయడం విశేషం. గిల్ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరిన తర్వాత, సూర్యకుమార్ యాదవ్ డక్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అభిషేక్ ఆగలేదు.. కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, పాక్ బౌలర్లను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాడు. చివరికి 39 బంతుల్లో 74 పరుగులు (5 సిక్స్‌లు, 6 ఫోర్లు) చేసి ఔట్ అయినా.. భారత్ విజయానికి బలమైన పునాది వేసి వెళ్లాడు.
తరువాత వచ్చిన సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కలిసి లక్ష్యాన్ని సులభంగా పూర్తి చేశారు. తిలక్ వర్మ 30 పరుగులు చేస్తూ నిలకడ చూపించాడు. ఫలితంగా భారత్ 18.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ విజయంతో సూపర్-4 పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలోకి ఎగబాకింది.
ఇక అంతకుముందు పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఫర్హాన్ ఒక హాఫ్ సెంచరీతో 58 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. అయితే భారత బౌలర్లు కీలక సమయంలో బ్రేక్‌లు ఇవ్వడంతో పాక్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఈ మ్యాచ్ భారత్-పాక్ మధ్య ఉన్న టెన్షన్, ప్రతిష్ట కారణంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టేడియంలో టికెట్లు దొరకక అభిమానులు వేలమంది బయట స్క్రీన్లపై మ్యాచ్‌ను వీక్షించారు. ప్రతి బౌండరీ, ప్రతి వికెట్‌కు ప్రేక్షకుల కేరింతలు మార్మోగాయి. భారత్ వరుసగా పాకిస్థాన్‌పై రెండోసారి గెలవడం అభిమానుల్లో ఆనందం నింపింది. ఇప్పుడీ విజయంతో భారత్ ఫైనల్ బరిలో అడుగుపెట్టే అవకాశాలు మరింత బలపడ్డాయి. ఇక తన తర్వాతి మ్యాచ్‌లో సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
