ఘోర విషాదం – దేశంలో అతిపెద్ద రైలుప్రమాదం: ఒడిశాలో మూడు రైళ్ల ఢీ!

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మాటలకందని మహా విషాదాన్ని మిగిల్చింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో ఒకే చోటఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 233 మంది దుర్మరణం పాలవ్వగా.. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. మరో 600-700 మంది బోగీల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతుండటం ఈ సందర్భంగా గమనార్హం.

స్థానికుల కథనం ప్రకారం… బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌ లోని హావ్‌ డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌ డా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పడంతో… దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌ పై పడిపోయాయి. ఆ సమయంలో ఆ ట్రాక్ పై వెళ్తున్న షాలిమార్‌ – చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి.

అనంతరం… బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌ లను పక్కనున్న ట్రాక్‌ పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత ఊహకందని రీతిలో పెరిగిపోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలోనూ గాయపడినవారిలోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా రైలు ప్రమాదంపై వివరాలు అందించేందుకు పలు హైల్ప్‌ లైన్‌ నంబర్లను రైల్వేశాఖ ఏర్పాటుచేసింది. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం (040 27788516), విజయవాడ రైల్వే స్టేషన్‌ (0866 2576924), రాజమండ్రి రైల్వే స్టేషన్‌ (0883 2420541), రేణిగుంట రైల్వే స్టేషన్‌ (9949198414), తిరుపతి రైల్వే స్టేషన్‌ (7815915571) సహాయ కేంద్రాలకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.