పంచాయితీ పోరులో వైసీపీకి స్పీడ్‌ బ్రేకర్స్‌ ఇవేనా.?

YSRCP cadres upset with MLA Ravindranath Reddy

ఇసుక.. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కి అతి పెద్ద సమస్యగా మారిపోయింది. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరిగిందనీ, ఇసుక పేరుతో అడ్డంగా టీడీపీ నేతలు దోచుకున్నారనీ వైసీపీ ఆరోపించింది. అందులో నిజం లేకపోలేదు కూడా. ఇసుకని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొందరు రాజకీయ నాయకులు. ఇది వైఎస్సార్‌ హయాంలోనే మొదలైంది. అప్పట్లో వైఎస్సార్‌, పలువురు మంత్రులకు ఇసుక వ్యవహారంపై క్లాసులు కూడా తీసుకున్నారు. అలాంటి ఇసుక రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.

ఇసుక పాలసీ అన్నారు, వరదలన్నారు.. ఏవేవో కారణాలు చెబుతున్నారుగానీ, వైసీపీ హయాంలో ఇసుక అయితే సామాన్యుడికి అందాల్సిన రీతిలో అందడంలేదు. గ్రామ స్థాయిలో ఈ సమస్య చాలా తీవ్రంగా వుంది. ఇదే ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి ముఖ్యమైన స్పీడ్‌ బ్రేకర్‌ అవబోతోందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో కనిపిస్తోంది. మరో సమస్య.. మద్యం. జగన్‌ హయాంలో మద్యం రేట్లు అత్యంత దారుణంగా పెరిగిపోయాయి. పైగా, అడ్డగోలు బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియుల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. అలాగని మద్యం ప్రియులు, మద్యానికి దూరమవుతారా.? అంటే ఛాన్సే లేదు. ప్రత్యామ్నాయంగా నాటు సారా, కల్లు వంటి వాటికి అలవాటు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో శానిటైజర్లు తాగేసి ప్రాణాలు కోల్పోయిన మందుబాబులూ లేకపోలేదు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటి సమస్యలు చాలానే వున్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వ వైఫల్యాలుగానే చూస్తున్నాయి విపక్షాలు. చాలా చోట్ల ప్రజలు కూడా ఇదే భావనతో వున్నారు. అయితే, పంచాయితీ ఎన్నికలంటే స్థానిక అంశాల ప్రాతిపదికనే జరుగుతాయి.. ఓటర్ల ఆలోచనలు కూడా అలాగే వుంటాయన్నది ఇంకో వాదన. ‘అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది’ అనే భావన ఖచ్చితంగా పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో వుండి తీరుతుంది. అదే అధికార పార్టీ గట్టి నమ్మకం కూడా. అందుకే ఏకగ్రీవాలపై వైసీపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. కానీ, పైన చెప్పుకున్న సమస్యలు అధికార పార్టీకి కాస్తో కూస్తో ‘ఇబ్బంది’ పెట్టడమైతే ఖాయం ఈ పంచాయితీ ఎన్నికల్లో.