కురు, పాండవులకు ద్రోణాచార్యుడు గురువు. నూర్గురు కౌరవులు, ఐదుగురు పాండవులలో ద్రోణాచార్యుడికి అర్జునుడే ప్రియశిష్యుడు.గౌరవనీయమైన గురువు స్థానంలో ఉన్నప్పటికీ, కురుపాండవులు సమంగా గురువును గౌరవిస్తున్నప్పటికీ ప్రియశిష్యుడిపై ఉన్న అవ్యాజమైన ప్రేమ ద్రోణుడితో తప్పులు చేయిస్తుంది.
తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన అర్జునుడి భవిష్యత్తుకు ప్రమాదం వస్తుందని భావించి తనకు ప్రత్యక్షంగా శత్రుత్వం లేకపోయినా, తాను స్వయంగా శిక్షణ ఇవ్వకపోయినా ద్రోణుడు ఏకలవ్యుడి బొటనవేలు తీసేసుకుంటాడు.
తనవారికి ఆపద వస్తుందనే ఆలోచనతోనే గౌరవనీయ స్థానంలో ఉన్నానన్న స్పృహ ద్రోణుడు కోల్పోతాడు.
తనకిష్టుడైన అర్జునుడికి రాధేయుడు ప్రత్యర్థి అవుతాడని, అవుతున్నాడని ఆందోళనతో తన గురుస్థానం గొప్పదనం కూడా మర్చిపోయి అకారణంగా కర్ణుడిపై ద్రోణుడు ద్వేషం పెంచుకుంటాడు.
మనకు కావలసిన వారిపట్ల మనకుండే ప్రేమ మనకు సంబంధం లేని వ్యక్తులపట్ల కూడా ద్వేషాన్ని పెంచుతుంది. ద్రోణుడి ప్రేమ కూడా అలాంటిదే. అర్జునుడి పట్ల ఆయనకున్న ప్రేమ ఏకలవ్యుడికి అన్యాయం చేయించింది. సూర్యపుత్రుడికి సహాయం నిరాకరించేలా చేసింది.
ఎంత గౌరవనీయమైన గురువృత్తిలో ఉంటేనేం!? గురుదేవా అంటూ అందరూ గౌరవిస్తున్నా సదరు గురువు ద్రోణుడు మాత్రం తనకు ప్రీతిపాత్రుడైన అర్జునుడి పక్షమే. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకిష్టుడైన అర్జునుడికి మేలు జరగాలని కోరుకుంటాడు.
కొందరి పట్ల మనకుండే అవ్యాజమైన ప్రేమాభిమానాలు, ఇంకొందరి పట్ల ఉండే వ్యతిరేకత మన స్థానాన్ని, స్థాయిని, ఆలోచనలను, చర్యలను ప్రభావితం చేస్తాయి. గౌరవనీయ స్థానంలో ఉన్న గురుదేవుడు ద్రోణుడు కూడా ఈ ప్రేమకు ప్రభావితం కాకుండా ఉండలేకపోయాడు. అర్జునుడిపై అవ్యాజమైన ప్రేమ లేకపోతే పూజ్యనీయులు, గురుదేవులు ద్రోణాచార్యులవారికి ఏకలవ్యుడితో, రాధేయుడితో వైరం ఏముంది?
ప్రస్తుత పరిణామాల్లో ద్రోణాచార్యులు, అర్జునుడు, కర్ణుడు మరియు ఏకలవ్యుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.