“ప్రతీ ఎన్నికల్లోనూ నోటాతో పోటీపడుతుందని ఫ్లవర్ అనుకుంటివా… అప్పుడప్పుడూ ఫైర్ కూడా” అంటూ సిరియస్ అవుతుంది ఏపీ బీజేపీ. “అసెంబ్లీలో సీట్లు లేకపోవచ్చు.. ఈవీఎం లలో ఓట్లు కనిపించకపోవచ్చు.. బట్ ఇది జాతీయ పార్టీ” అంటూ దర్పం ప్రదర్శించేపనికి పూనుకుంది. అందులో భాగంగా… బ్రతిమాలీ కొద్దీ మరీ బెట్టుచేస్తున్న జనసేనానికి షాకిచ్చింది. “పొత్తులందు జనసేనతో పొత్తు వేరయా..” అంటూ ఇంతకాలం ఇబ్బంది పడ్డ ఏపీ బీజేపీ… సింగిల్ గానే సై అంటుంది.
వివరాల్లోకి వస్తే… పైకి మిత్రులుమని – మిత్రపక్షాలమని చెప్పుకుంటుంటారు జనసేన – బీజేపీ నేతలు. కానీ చేతల్లో ఎక్కడా కలిసి ఉండరు.. కలిసి పోటీచేయరు.. కలిసి పోరాటాలూ చేయరు. ఆఖరికి ఎన్నికల్లోనూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోరు. ఇది ఏపీలో జనసేన – బీజేపీ స్నేహం తాలూకు చిత్రం. ఈ విచిత్ర బంధం ఇక వద్దని ఫిక్సయ్యినట్లుంది బీజేపీ. అలా అనుకున్నదే తడవుగా.. ఒంటరిగానే నియోజకవర్గ కన్వీనర్లను ప్రకటించేసుకుంది.
అవును… ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 163 సీట్లకు బీజేపీ తన పార్టీ నుంచి కన్వీనర్లను, కో కన్వీనర్లను ప్రకటించింది. రేపటి ఎన్నికల్లో వీరే ఎమ్మెల్యే అభ్యర్ధులు అని ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చింది. అంటే.. ప్రస్తుతానికి 163 అంటే… ఇంక 12 నియోజకవర్గాలు మాత్రమే మిగిలాయన్న మాట. ఇంగా గట్టిగా మాట్లాడితే… రేపో మాపో వాటికి కూడా కన్వీనర్లను పార్టీ ప్రకటించేట్టుగానే ఉందట.
బీజేపీ ఎంత కలుపుకుపోదామన్నా… తన మనసంతా మరొకరిపై పెట్టుకున్న పవన్… ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి కలిసిరావడం లేదు. ఇది ఏమాత్రం సరైన చర్య కాదు. పొత్తు అన్నాక కలిసుండాలి – కలుపుకుపోవాలి. ఈ విషయంలో పవన్.. బీజేపీకి అందించిన సహకారం, చేసిన సాయం శూన్యం అనే చెప్పాల్సిన పరిస్థితి. దీతో చిర్రెత్తుకొచ్చిందో ఏమో కానీ.. కన్వీనర్లను ప్రకటించేసింది.
అయితే ఇలా ఉన్నఫలంగా ప్రకటించడం వెనక ఇక “పొత్తు చిత్తు” అని చెప్పడమే అని అంటున్నారు విశ్లేషకులు. ఫలితంగా… మాకేమి పొత్తులు లేవు – సంబంధాలు అంతకంటే లేవు అని బీజేపీ సందేశం ఇస్తోందని చెబుతున్నారు. అంటే… రెండు పార్టీలు పొత్తులు పెటాకులు చేసుకునేందుకే సిద్ధపడుతున్నాయన్నమాట. ఈ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత పరోక్షంగా పలుమార్లు చెప్పగా… ఈసారి మరింత క్లారిటీగా బీజేపీ డైరెక్ట్ అటాక్ చేసేసిందన్నమాట.
మరి ఈ హటాత్ పరిణామంపై జనసేన అధినేత ఎలా స్పందిస్తారు, ఏమని స్పందిస్తారు.. అసలు స్పందిస్తారా, లేదా అన్నది వేచిచూడాలి!