రాజకీయాల్లో వెన్నుపోట్లు అత్యంత సహజం. వెన్నుపోటు రాజకీయాలతోనే, రాజకీయంగా కొందరు అత్యున్నత స్థాయికి చేరుతుంటారు. ‘వెన్నుపోటు’ అనగానే రాజకీయాల్లో ముందుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరు వినిపిస్తుంటుంది. అయితే, ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేకుండా అన్ని పార్టీల్లోనూ ఈ ‘వెన్నుపోటు’లో ఆరితేరిన నేతలుంటారు. పదవుల కోసం అధినేత భజన చేయడం, పదవులు దక్కకపోతే.. అడ్డగోలు విమర్శలు చేయడం రాజకీయాల్లో మామూలే. ఏడాదిన్నర పాలన తర్వాత, ఇప్పుడిప్పుడే వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తి సెగలు షురూ అవుతున్నాయి.
ఉత్తరాంధ్రకి చెందిన సీనియర్ నేతతో తలనొప్పి
వైసీపీకి చెందిన ఉత్తరాంధ్ర నేత ఒకరు (ప్రస్తుతం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా వున్నారు) తెరవెనుక ‘వెన్నుపోటు’ రాజకీయం షురూ చేశారట. ఉత్తరాంధ్రలో తన వర్గానికి చెందిన నేతలందరితోనూ రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారట. పార్టీ భవిష్యత్తేమిటి.? అన్నదానిపై ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవల్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నారట ఆ సీనియర్ నేత. అమరావతి, మూడు రాజధానుల వ్యవహారాల్లో పార్టీకి కొంత నెగెటివిటీ వచ్చిందనే అభిప్రాయంతో సదరు నేత వున్నట్లు తెలుస్తోంది. తన పేరు బయటకు రాకుండానే తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టేయడం ఆయన ప్రత్యేకత. ఈ విషయమై వైఎస్ జగన్ కోటరీ నేత అప్రమత్తమయ్యారనీ, సదరు నేత వ్యవహార శౖలిపై ఆరా తీస్తున్నారనీ సమాచారం.
సీమలోనూ పార్టీకి వెన్నుపోటు పొడిచే శక్తులున్నాయా.?
వైఎస్సార్సీపీకి కంచుకోట రాయలసీమ రీజియన్. ఈ ప్రాంతంలో వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదిపేంత సీన్ ప్రస్తుతానికైతే ఎవరికీ లేదు. కానీ, ఓ సీనియర్ నేతకి మొదటి నుంచీ వైఎస్ జగన్‌తో రాజకీయ వైరం వున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్తు నిమిత్తం వైఎస్ జగన్‌ని ప్రసన్నం చేసుకుంటూనే వున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆయన వ్యవహార శౖలిపై వైసీపీ అధినాయకత్వం అసంతృప్తితో వుందట. కొన్ని చోట్ల అసంతృప్త సెగలకు సదరు సీనియర్ నేత ఆజ్యం పోస్తున్నారనే విషయం అధిష్టానం దృష్టికి వచ్చిందట.
అప్రమత్తం కావాల్సిన సమయమిదే..
సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న వైఎస్ జగన్, పార్టీ వ్యవహారాల పట్ల అంతగా దృష్టి సారించడంలేదన్న విమర్శ వుంది. గ్రౌండ్ లెవల్‌లో కొందరు నేతల అత్యుత్సాహం ఇటు పార్టీకీ, అటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తున్న దరిమిలా.. ‘వెన్నుపోటు’ వరకూ ఆ రాజకీయం ముదరకుండా వీలైనంత త్వరగా వైఎస్ జగన్.. ఆ నెగెటివిటీని తగ్గించడానికి చర్యలు చేపట్టాల్సి వుంది. కోటరీ నేతలే అన్నీ చూసుకుంటారనే ఆలోచనతో లైట్ తీసుకుంటే.. చిన్న చిన్న విషయాలే పార్టీ పునాదుల్ని కూల్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.