ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ రాబోతున్నదని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే మళ్ళీ మొదలైందట. అక్కడ ఫైజర్ వారి వాక్సిన్ వచ్చినప్పటికీ మనదేశానికి వాక్సిన్ రావడానికి మరో నాలుగైదు మాసాలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే దేశంలో కరోనా ఉధృతి గతంలోకన్నా చాలా తగ్గింది. ఒకప్పుడు కరోనా పేరు వింటేనే గజగజ వణికిపోయిన జనం గత నాలుగైదు నెలలుగా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఫేస్ మాస్క్ ధరించడం, శుచి శుభ్రత పాటించడం, శానిటైజర్లను వినియోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా నుంచి రక్షించుకోవచ్చన్న స్పృహ బాగా పెరిగింది. కరోనాను ఒక భూతం అని భయపడే స్థితి నుంచి అదొక సాధారణ వైరస్ అని సరిపెట్టుకుని జీవితాన్ని సాగించే ధైర్యం ప్రజల్లో వచ్చింది. దూర ప్రయాణాలు సాగుతున్నాయి. మళ్ళీ ఆలయాలు, పర్యాటకకేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వ్యాపారాలు కూడా బాగానే పుంజుకున్నాయి.
అయితే కరోనా వైరస్ మళ్ళీ వస్తుంది అనే నిపుణుల హెచ్చరికలు చేస్తున్న కారణంగా ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేస్తున్నట్లు నిన్న కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బజెట్ సమావేశాలు జనవరిలో జరిపే అవకాశం ఉన్నది. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీలు సమ్మతించాయట. ఎందుకంటే పార్లమెంట్ లో రెండు వందలమందికి పైగా సభ్యులకు అరవై అయిదు సంవత్సరాలు దాటాయి. కనుక రిస్క్ తీసుకునే ఆలోచన కేంద్రానికి లేనట్లుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనరుగారికి అసలు కరోనాయే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిపించలేమని, ఉద్యోగులు వైరస్ బారిన పడతారని, ఎన్నికలను జరిపే ఆలోచనను మర్చిపొమ్మని ప్రభుత్వం ఎన్నిసార్లు వేడుకున్నా కమీషనర్ చెవులకు వినిపించడం లేదు. ఎంతమంది చచ్చినా సరే..ఎన్నికలు నిర్వహిస్తాను అని హఠం వేసుకుని కూర్చున్నారు! ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రప్రభుత్వ వాదనకు బలం చేకూర్చేదే. కేంద్రం చూపిన కారణాన్ని రాష్ట్రం కూడా కోర్టులో చూపి ఎన్నికల నిర్వహణను వాయిదా వేయించవచ్చు.
అయితే ఇటీవల బీహార్, తెలంగాణల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం జరిగిన తీరు, ఈరోజు కర్ణాటక శాసనమండలిలో సభ్యులు కొట్టుకున్న తీరు చూస్తుంటే కరోనా అన్నది అసలు మనదేశంలో ఉన్నదా లేదా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా.
అంతేకాకుండా గత రెండువారాలుగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన, వారి ఆందోళనకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతుకు భయపడి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఒక వాదన వినిపిస్తున్నది. మరి ఏది నిజమో!