ఎంతో పవిత్రమైన దేవాలయంలా భావించే అసెంబ్లీ శీతాకాలపు తొలిరోజు సమావేశాల్లోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నది. అసలే అధికారం కోల్పోయి ఉండటం, దానికితోడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అత్యంత ప్రజారంజకంగా సాగుతూ ఏడాదిన్నర కాలం తరువాత కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలతో దూసుకుని పోతుండటం, జగన్ దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడం, నిన్నో మొన్నో ఇండియా టుడే వారి సర్వేలో అభివృద్ధిలో, ప్రజారంజనలో జగన్మోహన్ రెడ్డి పేరు మొదటి నంబర్లో ఉండటం లాంటి అనేక అంశాలతో అసహనంతో రగిలిపోతున్న చంద్రబాబు ఆ అక్కసు అంతా ఈరోజు అసెంబ్లీలో ప్రదర్శించి సభ్యసమాజం చేత ఛీ కొట్టించుకున్నారు!

నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం, పదునాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ అనుభవం, పన్నెండేళ్ల ప్రతిపక్ష నాయక అనుభవం కలిగిన చంద్రబాబు అసెంబ్లీలో ఎంత హుందాగా మెలగాలి! అందులోనూ తొలిసారి ముఖ్యమంత్రి అయిన యువకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత పెద్దరికంగా వ్యవహరించాలి! సభలోనే అత్యంత సీనియర్ నేతగా తన కన్నా చిన్నవారైనా అధికారపక్ష సభ్యులకు మార్గదర్శనం చేస్తూ, పరిపాలనలో సలహాలిస్తూ ఆదర్శంగా మెలగాల్సిన చంద్రబాబు వీధిరౌడీలా రంకెలు వేస్తూ, ఆవేశంతో ఒడలంతా కదిలిస్తూ, బెదిరిస్తూ హెచ్చరిస్తూ, వేళ్ళు చూపుతూ, కళ్ళు లావు చేస్తూ, ఆగ్రహంతో ఊగిపోతూ…ఏమిటా ప్రవర్తన? ఎంత అసహ్యకరంగా ఉన్నది?
అసలే కోవిద్ రోజులు. కేంద్రప్రభుత్వం సైతం పార్లమెంట్ ను సమావేశపరచాలంటే భయపడుతున్నది. అసెంబ్లీ కేవలం అయిదు రోజులు మాత్రమే జరుగుతుంది. అంత క్లుప్త సమయంలో ప్రజాసమస్యలను గూర్చి చర్చించకుండా చంద్రబాబు అప్రజాస్వామికంగా ప్రవర్తించడం సబబేనా? పైగా ఒక మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను ఉద్దేశిస్తూ “ఏమి పీకుతావ్” అంటూ గుడెళ్లెర్రజేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఇదేనా చంద్రబాబు సంస్కారం? డెబ్బై ఏళ్ల వయసులో ఆ ప్రవర్తన ఊహించగలమా?
ఏమి పీకాలో, ఎవరిని పీకాలో గతేడాది జనం పీకేశారు. కలుపుమొక్క లాంటి చంద్రబాబును, ఆయన పార్టీని జనం పీకి అవతల పారేశారు. మూడేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన కొడుకును కలుపుమొక్క కన్నా నీచంగా పీకి విసిరేశారు. జనం తనకు చేసిన శాస్తిని విస్మరించి చంద్రబాబు అసెంబ్లీలో తనకు పచ్చమీడియా ఉన్నదన్న ధైర్యంతో రెచ్చిపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా జనం పీకేస్తారు. చంద్రబాబు లాంటి సీనియర్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి తప్ప అసహ్యించుకునేలా కాదు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి మహాపచారం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
