స్మాల్ డౌట్…. అమిత్ షా కేంద్ర హోంమంత్రే కదా!?

గత రెండు రోజులుగా ఒక్కశాతం ఓట్లు ఉన్న ఏపీలో బీజేపీ నేతలు తెగ హల్ చల్ చేస్తున్నారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న అనంతరం తెలంగాణ, ఏపీలో ఫోకస్ పెడుతున్న బీజేపీ హస్తిన పెద్దలు… ఏపీలో సభలు పెడుతున్నారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న విమర్శలపై పెదవి విరుస్తున్నారు ఏపీ ప్రజానికం. మాట్లాడుతున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులేనా.. లేక, ఏపీలో ప్రతిపక్షంలో మూలుగుతున్న పార్టీ నాయకులా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు.

తాజాగా విశాఖలో మైకందుకున్న అమిత్ షా… “ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేమీ చేయలేదు. జగన్‌ పాలనలో విశాఖపట్నాన్ని అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారు” అని చెప్పుకొచ్చారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విశాఖ రైల్వే మైదానంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన “మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌” సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

అయితే కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చిల్లర వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు చేయడం ఏమిటనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ తప్పుచేస్తే, అవినీతికి పాల్పడుతుంటే, అక్రమాలు చేస్తుంటే… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు చూస్తూ ఉండిపోయింది? ఎన్నికల వేళ విమర్శలు చేయడానికి ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి జగన్ అవినీతిని చూస్తూ ఉండిపోయిందా?

ప్రస్తుతం ఏపీ ప్రజానికం అమిత్ షా పై సందిస్తున్న ప్రశ్నలు ఇవే! జగన్ పై విమర్శలు చేయడం, అవినీతి అక్రమాలు అని అనడం వల్ల ఎవరికి ప్రయోజనం అని జనం ప్రశ్నిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమ పాలన గురించి అమిత్ షా కళ్లుండీ చూడలేకపోతున్నారా, చెవులుండీ వినిపించుకోలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

కారణం… జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ మోడీ ఈ దేశానికి ప్రధాని. అమిత్ షా ఈ దేశానికి హోం మంత్రి. మరి ఈ జాతీయస్థాయి నేతలు, మంత్రులు అచేతనంగా ఎందుకు చూస్తున్నట్లు. చేతకానివారిగా ఎందుకు మిగిలిపోయినట్లు. జగన్ అవినీతిపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోనట్లు. ఇవన్నీ గ్రహిస్తున్న ప్రజల్లో అమిత్ షా విమర్శలకు విలువ ఎంతుంటుంది? శూన్యానికి దగ్గరగా కాదా అనే కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు!