H1B Visa Holders: హెచ్‌1బీ వీసాదారులకు అమెరికా షాక్‌! స్వదేశానికి వెళ్లొద్దని హెచ్చరికలు

అమెరికాలో వలస విధానాలు మరింత కఠినతరం అవుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో హెచ్‌1బీ వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తాత్కాలికంగా స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న వీసాదారులకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. అమెరికా వెళ్లే మార్గం తిరిగి తెరచుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయన్న వార్తలతో భారతీయ ఐటీ ఉద్యోగులు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ టెక్‌ సంస్థలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్‌1బీ వీసాదారులకు సూచనలు జారీ చేశాయి. అత్యవసరమైన పనులు కాకపోతే స్వదేశానికి ప్రయాణించవద్దని సూచిస్తున్నాయి. వెళ్లినవారికి తిరిగి అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి లభించే గ్యారెంటీ లేదని హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ పరిపాలనలో అక్రమ వలసదారులపై చర్యలు కఠినంగా ఉంటాయని ఇప్పటికే పలు సందర్భాల్లో తేలిపోయింది.

ఈ ఆందోళనల నేపథ్యంలో భారత్‌ వెళ్లాలని అనుకున్న పలువురు వీసాదారులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ‘వాషింగ్టన్ పోస్ట్’ నివేదిక ప్రకారం, ఇప్పుడిప్పుడే ఆఫీసులకు తిరిగి వెళ్లే పరిస్థితులు ఉన్నా, వీసా హోల్డర్లకు ఇది మరో సమస్యగా మారింది. అమెరికా పౌరులు కాకుండా మిగతా వారందరినీ అక్రమ వలసదారుల్లా చూస్తున్న ప్రస్తుత పరిస్థితే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.

ఇక భారత ఎంబసీ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అమెరికాలో ఉన్న ఎన్నారైలందరిని అప్రమత్తం చేస్తూ, అవసరమైన పత్రాలు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించింది. ఇకపై ప్రయాణించే ముందు పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా పేర్కొంది. మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నారైలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.