రాజధానిపై ఇంత రాద్ధాంతం అవసరమా? 

Amaravati and Vishakapatnam

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పు నిర్ణయంపై చర్చలు ఇంకా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో చిటారు కొమ్మమీద ఉన్నట్టు కనిపించే విశాఖపట్నం రాజధాని అంటే  చాలా మందికి మింగుడు పడలేదు. విశాఖకు అనుకూలంగా వ్యతిరేకంగా అతివాదులు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. కొందరు నాయకులైతే క్రైమ్ రైటర్స్ అవతారమెత్తి వైజాగ్ లో రాజధాని ఏర్పడకుండా తెలుగుదేశం నాయకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అక్కడితో ఆగకుండా విశాఖ ఫ్యాక్టరీలలో గ్యాస్ లీకులకు టిడిపి వారికీ లింకులు పెడుతున్నారు. విశాఖ సురక్షితమైన నగరం కాదన్న అభిప్రాయం కలిగించి, రాజధాని కాకుండా చేయాలని తెలుగుదేశం నాయకులే ఫ్యాక్టరీలలోకి ముసుగు వీరులను పంపి గ్యాస్ గొట్టాలను డిస్టర్బ్ చేస్తున్నారన్న వదంతులను లీక్ చేస్తున్నట్టు కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. మొత్తానికి నూతన పరిపాలన రాజధాని అనే సీరియస్ విషయం సందుల్లో పోకిరీ పిల్లల గొడవలా మారింది.

Read More : మాజీ టీవీ-9 ర‌విప్ర‌కాష్ కి హైకోర్టు బెయిల్

చంద్రబాబు నాయుడు ఐదారు ఏళ్ల  క్రితం ఆంధ్రుల రాజధాని ‘అమరావతి’ అంటూ తన మెజీషియన్ సంచి నుంచి బయటకు తీసినప్పుడే కేపిటల్ సిటీ అనేది ఒక కామెడీ థ్రిల్లర్ గా మారిపోయింది. ఇంద్రలోకం నుంచి ఎవరైనా వచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడని అమాయకంగా అడిగితే అప్పట్లో బెజవాడ పక్కన, మంగళగిరికి ఇవతల, గుంటూరు జిల్లాపరిధిలో, కృష్ణా నదికి కొంచెం దూరంలో, తుళ్లూరు సమీపంలోని వెలగపూడి వెళ్ళమని చెప్పవలసి వచ్చేది. మరి అమరావతి ఎక్కడ అని ఆ ఇంద్రదూతలు ప్రశ్నిస్తే ఆ పెద్ద గ్రామం అక్కడికి పాతిక కిలో మీటర్ల దూరంలో ఉందని చెప్పాలి. మరి ఆ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే అది ఒక గొప్ప విశేషం అని చెప్పి తప్పుకోవాల్సి వచ్చేది.

Read More : ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. అల్‌టైమ్ రికార్డు న‌మోదు..!

ఇన్ని షాకులు తిన్న ఆంధ్రులకు సరికొత్త రాజధాని ఎక్కడైతే ఏమిటన్న నిర్వేదం, అనాసక్తి వచ్చేసింది. అమరావతి అయినా ఆముదాల వలస అయినా ఒకటే అన్న విసుగు వచ్చేసింది. సచివాలయం వైజాగ్ లో ఉంటే సామాన్యులకు పెద్ద నష్టం ఏమీ జరగదు. ఎంత మంది సామాన్యులు సెక్రటేరియట్ వరకు  తరచు వస్తారు? వాళ్లు మండలాఫీసుల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఆ విష వలయంలోనే కొన ఊపిరితో బ్రతుకుతూ ఉంటారు. సచివాలయం వరకు వెళ్ళవలసిన అవసరం వారికి జీవితకాలంలో అతి తక్కువ సార్లు ఏర్పడుతున్నది. ఇక డైరెక్టరేట్లు, కమిషనరేట్ల సంగతి కూడా అంతే. ఇక బాధ అంతా హైదరాబాద్ లో స్ధిరపడిన, అమరావతిలో స్ధిర నివాసం లేని ప్రభుత్వ ఉద్యోగులకే.

Read More : గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ.. అస‌లు కార‌ణం ఇదే..!

మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడు రాజభవనం ఉన్నది హైదరాబాద్ లోనే. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులలో ఎక్కువ మంది స్థిర నివాసాలు హైదరాబాద్ లోనే కదా? మాజీ ప్రజారాజ్యాధినేత చిరంజీవి, ప్రస్తుత జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అడ్రసు హైదరాబాదే కదా? ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస విలాసాలు హైదరాబాద్ లోనే కదా? టిడిపి నెంబర్ టు నాయకుడు లోకేష్, ఎపి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణడు నెలవై ఉన్నది హైదరాబాద్ లో కాదంటారా? టీవీ చానళ్లు, వాటిలో మేధావుల డిబేట్లు, మతి పోగొట్టే విశ్లేషణలు జరుగుతున్నవి హైదరాబాద్ గడ్డ మీద కాదా? ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు రహస్యంగా సమావేశమయ్యే స్టార్ హోటళ్లు ఉన్నవి భాగ్యనగరం లోనే కదా.

Read More : మ‌రో జ‌ర్న‌లిస్ట్‌ను బ‌లితీసుకున్న క‌రోనా..!

రాజధాని ఎక్కడున్నా అంధ్రుల గుండె చప్పుడు వినిపించేది హైదరాబాద్ లోనే. అటువంటప్పుడు భ్రమరావతిపై ప్రేమలెందుకు? విశాఖపై ద్వేషమెందుకు? అనారోగ్యాలు, నిరుద్యోగాలు, ఇంకా ఇన్నో సీరియస్ సమస్యలు వేధిస్తుండగా కొత్త, సరికొత్త రాజధానులపై  ఇంత రగడ అవసరం లేదనిపిస్తోంది. అమాయకంగా పొలాల్లో పనిచేసుకుంటున్న, జలరాశుల్లో చేపలు పట్టుకుంటున్న, పశువులను కాసుకుంటున్న, కనీస జీతాల్లేని అసంఘటిత రంగాల్లో కునారిల్లుతున్న తోటి ప్రజల గురించి ఆలోచించ లేమా?

-శాంతారామ్ , సీనియర్ జర్నలిస్టు