కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ, ప్రజల ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. కడప జిల్లాలోని నల్లపురెడ్డిపల్లెలో మంగళవారం నాడు పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు అరాచకాలకు పాల్పడ్డారని పలువురు గ్రామస్థులు జగన్‌కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఓటర్లపై కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తూ, “ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు” అంటూ ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు.
గ్రామస్థులు చెప్పిన విషయాలపై స్పందించిన జగన్, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో దౌర్జన్యాలు చేశారు” అని జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలతో ప్రజలను మోసం చేశారని కూడా ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలపై దాడి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.


