పంచాయితీ ఫలితాలన్నీ జగన్మోహన పక్షమే 

All the panchayat results are in favor of Jaganmohan reddy
శ్రీకాకుళం అని లేదు…చిత్తూర్ అని లేదు. ఉత్తరాంధ్ర అని లేదు రాయలసీమ అని లేదు…రాష్ట్రంలో జరిగిన తొలివిడత జరిగిన పార్టీ రహిత పంచాయితీ ఎన్నికల ఫలితాలు పూర్తి ఏకపక్షంగా సాగాయి.  దాదాపు ఎనభై అయిదు శాతం ఫలితాలు అధికారపార్టీ బలపరచిన అభ్యర్థులకు అనుకూలంగా వెలువడటంతో వైసిపి శ్రేణుల సంబరాలకు ఆకాశమే హద్దయింది.  రాష్ట్రం నలుమూలలా వైసిపి అభిమానులు, కార్యకర్తలు, విజేతలు  ఆనందతాండవం చేశారు.  ఈ వ్యాసం రాస్తున్న సమయానికి మూడువేల పంచాయితీ ఫలితాలు వెలువడగా వాటిలో రెండువేల ఆయిదు వందల పంచాయితీలు వైసిపి గెల్చుకోగా అయిదు వందల పంచాయితీలు తెలుగుదేశం పార్టీ గెల్చుకుంది.  ఇక బీజేపీ కనీసం యాభై పంచాయితీలు కూడా గెల్చుకోలేక పూర్తిగా చతికిల పడగా, వారి భాగస్వామి జనసేన పదకొండు గెల్చుకున్నామని ప్రకటించింది.  జనసేన వారు గెల్చుకున్న పంచాయితీలు సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తాయి అని వైసిపి వారు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.  
 
All the panchayat results are in favor of Jaganmohan reddy
అసెంబ్లీ ఎన్నికలు జరిగి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నది.  గత రెండు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అమలు పరచిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రతిఫలించింది అని విశ్లేషకుల అభిప్రాయం.  గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి పూర్తిస్థాయి పట్టును సాధించింది అని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.  అలాగే తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్నట్లు ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో అణుమాత్రం కూడా వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.  దాంతోపాటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుదించుకుని పోతున్నదని, ఆ పార్టీ ప్రభావంలో  ఏమాత్రం మార్పు రాకపోగా,  మధ్యాహ్నం ఎండవేడికి కరిగిపోతున్న మంచులా రోజు రోజుకు దిగజారిపోతున్నదని అర్ధమవుతున్నది.  జగన్ పట్ల జనంలో వ్యతిరేకత పెరుగుతున్నదని టిడిపి చేస్తున్న ప్రచారం కూడా గాలిమాటలే అని తేలిపోయింది.  
 
మరొక విశేషం ఏమిటంటే, అమరావతి ఉద్యమం అంటూ తెలుగుదేశం కొందరితో నడిపిస్తున్న నాటకం కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఓట్లు తెచ్చిపెట్టలేదు.  ఈ రెండు జిల్లాల్లో అత్యధిక పంచాయితీలు వైసిపి వశం కావడం చూస్తుంటే రాజధాని సెంటిమెంట్ తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లభించలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి.  అలాగే జగన్ ప్రతిపాదిత మూడు రాజధానుల అంశానికి ప్రజల మద్దతు లభించింది.  రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలనే జగన్ దార్శనికతకు ప్రజలు జేజేలు పలికారు.  
 
సోము వీర్రాజు అధ్యక్షుడుగా వచ్చాక బీజేపీ ఎదుర్కొన్న మొదటి ఎన్నికలు ఇవి.  ఫలితాలు పూర్తిగా నిరాశ కలిగించేవే.  సోము వీర్రాజుకు వాగ్ధాటి ఉన్నప్పటికీ ఆయన ఒక స్థిరమైన స్టాండ్ తీసుకుని పార్టీని ముందుకు నడిపించడంలో విఫలం అయ్యారని ఎన్నికల ఫలితాలు చాటి చెబుతున్నాయి.  ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఆంధ్రులను మోసం చేసిందనే ఆగ్రహం ఏమాత్రం చల్లారలేదు.  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేస్తారన్న వార్తలు కూడా బీజేపీకి కొంతమేర నష్టం చేశాయి.  జనసేనతో పొత్తును ప్రజలు అంగీకరించడం లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.  
 
జనసేన భవిష్యత్తు ఏమిటో కూడా ఈ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి.  ఎక్కడా ఒక్క పంచాయితీ కూడా జనసేన మద్దతుదారులకు లభించలేదు.  దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారు తప్ప ఓటర్లు లేరనే విషయం మరోసారి స్పష్టం అయింది.  పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలను ప్రజలు అంగీకరించడం లేదని, జనసేన ఉనికి కూడా రాష్ట్రంలో ఎక్కడా లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టాయి.  
 
బాటమ్ లైన్ గా చెప్పుకోవాలంటే ఈ ఎన్నికల ఫలితాలన్నీ జగన్మోహనం! 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు