పొలిటికల్ కోడి కత్తి: కుత్తుకలు తెగుతున్నాయ్!

All politicians are the same

ఈ కోడి కత్తి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కత్తి లాంటిదే. కానీ, ఇక్కడి సందర్భం వేరు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి కోడి పందాలే. ఆ ట్రెండ్ ఇప్పుడు పొరుగు జిల్లాలకూ పాకింది. ఆ మాటకొస్తే, రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాల హోరు కనిపిస్తోంది గత కొన్నేళ్లుగా. వేల రూపాయలే కాదు, లక్షల రూపాయల్ని వెచ్చించి మరీ కోళ్ళను పందాలకు సిద్ధం చేస్తుంటారంటే నమ్మగలమా.? కానీ, నమ్మి తీరాల్సిందే. గెలిచిన కోడి, ఓడి చచ్చిన కోడి.. రెండూ చివరికి చికెన్ పకోడీ అయిపోవాల్సిందే. కానీ, ఈ క్రమంలో కోట్లు చేతులు మారతాయి. గత కొన్నాళ్ళుగా ఈ కోడి పందాల చుట్టూ రాజకీయం విపరీతంగా నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీకి చెందిన నేతలు ఈ కోడి పందాల ద్వారా కోట్లు వెనకేసుకుంటున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాజకీయంగా ఎంత తిట్టుకున్నా, కోడి పందాలకు వచ్చేసరికి..

All politicians are the same
All politicians are the same

రాజకీయ నాయకులంతా ఒక్కటే. అందరూ కలిసిపోతారు.. కలిసి పంచుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాల కారణంగా కలిసిన రాజకీయ బంధం గురించి ఆసక్తకిరమైన చర్చ జరుగుతోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కొందరు, గ్రూపులుగా ఏర్పడి, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేకుండా ఈసారి కోడి పందాల్ని నిర్వహిస్తున్నారట. అంటే, స్వయంగా వాళ్ళే రంగంలోకి దిగరు. వారి బినామీలు అన్ని వ్యవహారాల్నీ చక్కబెట్టేస్తారు. ఫోన్ పే, గూగుల్ పే.. ఇలా డిజిటల్ పేమెంట్ల జోరు పెరిగిన నేపథ్యంలో, కరెన్సీ చేత్తో పట్టుకుని వెళ్ళాల్సిన అవసరమే తగ్గిపోయిందని పందాల్లో పాల్గొనేవారూ చెబుతుండడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు పర్యవేక్షిస్తున్నారనే చర్చ జరుగుతుండగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం, కోడి పందాలకు అనుమతి లేదంటున్నారు. ఏదిఏమైనా, ఈ సారి పొలిటికల్ కత్తులు ఓ అవగాహనతో వ్యవహరించడంతో.. కోడి పందాలు ఇంకాస్త సజావుగా సాగుతాయనీ, కోళ్ళ కుత్తుకలు రికార్డు స్థాయిలో తెగిపడనున్నాయనీ.. నోట్ల కట్టలు హల్ చల్ చేయనున్నాయనీ గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. మరోపక్క, పోలీసులు పందెం బరుల్ని ధ్వంసం చేయడంతోపాటు, ముందస్తు అరెస్టులతో తమవంతు కృషి చేస్తున్నారు కోడి పందాల్ని ఆపేందుకు.